రామ్ మాధవ్ రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. అలాగే మోడీ పాలన పూర్తయి నాలుగేళ్లవుతున్న సందర్భంగా జరిపిన సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలతో రామ్ మాధవ్ సమామేశమయ్యారు. ఏపీ బీజేపీకి ఇప్పుడు సమర్థమైన నాయకత్వం అవసరమని రామ్ మాధవ్ భావించారు. తొలుత రామ్ మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు, మాణిక్యాలరావులలో ఎవరో ఒకరికి ఈ పదవి ఇవ్వాలని అనుకున్నారు. కాని చంద్రబాబును సమర్థంగా ఎదుర్కొనాలన్నా, పార్టీని బలోపేతం చేయాలన్నా కన్నా లక్ష్మీనారాయణతోనే సాధ్యమవుతుందని ఆయన అధిష్టానానికి నచ్చ చెప్పి ఒప్పించగలిగారు.
కన్నాపైనే పూర్తి బాధ్యతలు.....
ఇప్పుడు కన్నా పై పూర్తి బాధ్యతలను పెట్టారు రామ్ మాధవ్. ఆయన అన్ని జిల్లాలు తిరిగి కార్యకర్తల్లో జోష్ తీసుకురావాలని ఆదేశించారు. ప్రధానమైన టార్గెట్ తెలుగుదేశం పార్టీగానే ముందుకెళ్లనున్నారు. నాలుగేళ్లలో కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి అమలు చేసిన పథకాలు, ఇచ్చిన నిధులతో పాటు భవిష్యత్తులో అమలుపర్చ బోయే కార్యక్రమాలను కూడా వివరించాలని కోరారు. బూత్ లెవెల్ కమిటీలను బలోపేతం చేయడమే కాకుండా ఇప్పటి నుంచే గ్రామాల్లో పర్యటించి ప్రజల మనోభావాలను తెలుసుకోవాలన్నారు.
ఎవరితో పొత్తు ఉండదు......
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఎవరితో పొత్తు ఉండదని రామ్ మాధవ్ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒంటరిగానే బరిలోకి దిగాల్సి వస్తున్నందున ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాలని ఆయన నేతలను ఆదేశించారు. అలాగే పార్లమెంటరీ నియోజకవర్గాలుగా బాధ్యులను నియమిస్తామని, తొలుత బీజేపీకి బలం ఉన్న స్థానాలను గుర్తించాలని నేతలను కోరారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి నుంచే ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీపై చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను ప్రజలకు వివరించాలని కోరారు.
టీడీపీయే టార్గెట్.....
తెలుగుదేశంపార్టీయే ఇప్పడు ప్రధాన శత్రువని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకుని నివేదిక రూపొందించాలన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తెలుగుదేశం మహానాడు సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడ చూసినా తండ్రీకొడుకుల ఫొటోలే కన్పిస్తున్నాయని, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ కడుతున్న విషయాన్ని వాడవాడలా ప్రచారం చేయనున్నారు. ఇలా బీజేపీ కొత్త అధ్యక్షుడి మీద రామ్ మాధవ్ అనేక బాధ్యతలు పెట్టారు. మరి రామ్ మాధవ్ ఎంట్రీతో టీడీపీకి ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు