Weather Report : ఏపీలో వర్షాలు.. తెలంగాణలో ఎండలు.. రెడ్ అలెర్ట్ జారీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను వర్షాలు వీడటం లేదు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది

Update: 2025-04-23 04:35 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను వర్షాలు వీడటం లేదు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. దీంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి వేళ ఎండలు, సాయంత్రానికి వర్షాలు పడుతుండటంతో భిన్నమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఛత్తీస్ గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ రకమైన వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈదురుగాలులతో కూడిన వర్షం...
ఈరోజు రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని, మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. దీంతో పాటు గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలోనూ నేడు, రేపు మోస్తరు వర్షాలు పడతాయని పండ్లతోటల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
మూడు రోజులు తెలంగాణలో...
ఇక ఏపీ తెలంగాణలలో రేపటి నుంచి సాధారణ డిగ్రీల కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేయగా, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం పదకొండు గంటల నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో నేటి నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.


Tags:    

Similar News