రాహుల్ గాంధీ పెళ్లి.... క్లారిటీ వ‌చ్చేసింది

Update: 2018-05-07 02:30 GMT

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాయ్‌బ‌రేలి ఎమ్మెల్యే అదితీ సింగ్‌ను పెళ్లి చేసుకోబోతున్నార‌న వార్తల‌కు ఎట్టకేల‌కు చెక్ ప‌డింది. పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితీసింగ్ స్పందించ‌డంతో అనేక ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. రాహుల్ త‌న‌కు రాఖీ బ్రద‌ర్ అంటూ స్పష్టం చేసింది. కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న రాహుల్‌ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రాయ్‌బరేలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదితీ సింగ్‌ను పెళ్లాడనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ఇరు కుటుంబాలు చర్చించుకున్నాయంటూ రాహుల్‌-అదితీ కలిసి ఉన్న ఫొటోలను సోష‌ల్ మీడియాలో ఉంచారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఇదే నెలలో వీరిద్దరి పెళ్లి జరగనుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నాకు పెద్దన్నయ్యతో.....

అయితే ఈ వార్తలు మొదటగా రాయ్‌బరేలీలోని కొందరు వ్యక్తులు వాట్సాప్‌ వేదికగా ప్రచరారం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈవార్తల్లో ఎటువంటి నిజం లేదని అదితీ సింగ్‌ స్పష్టం చేశారు. దీనిపై అదితీసింగ్‌ మాట్లాడుతూ..‘ ఈ వార్తలు నన్ను చాలా బాధించాయి. దీనిపై ఇప్పటికైనా నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. రాహుల్‌ నాకు పెద్దన్నయ్యతో సమానం. ఆయన నాకు రాఖీ బ్రదర్. సోష‌ల్ మీడియాలో సంచలనం అవుతోన్న ఈ వార్తలను విని ఎంతగానో బాధపడ్డా. ఇప్పటికైనా వీటికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అయితే ఈ వార్తలపై సోనియా కానీ, రాహుల్‌ గానీ స్పందించలేదు.

సృష్టించినవే....

ఇదిలా ఉండ‌గా...ఈ వదంతుల‌ను రాయ్‌బరేలీకి చెందిన ఇద్దరు వ్యక్తులు సృష్టించినట్లు తేలింది. రాహుల్‌-అదితీ ఫొటోలను కలిపి ఉంచి వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు సందేశాలు పంపారు. అయితే అదితీసింగ్‌ గత ఎన్నికల్లో ప్రత్యర్థిపై అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విదేశాల్లో మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ చదివి ఇండియాకు తిరిగొచ్చిన అనంతరం అదితీ సింగ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతేకాదు రాహుల్ సోదరి ప్రియాంకా వాద్రాకు అదితి అత్యంత సన్నిహితురాలు కావ‌డం గ‌మ‌నార్హం. ఆ వార్తల‌తో ఎట్టకేల‌కు రాహుల్ పెళ్లిచేసుకోబోతున్నార‌ని అనుకున్న పార్టీ శ్రేణుల‌కు అదితీసింగ్ ప్రక‌ట‌నతో సైలెంట్ అయిపోయారు.

Similar News