రాహుల్.... ఏం వేశారులే?

Update: 2018-05-03 18:29 GMT

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగాల్లో రాటుదేలిపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీని వదిలిపెట్టడం లేదు. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ మోడీపై ప్రతి సభలోనూ విరుచుకుపడుతున్నారు. మోడీ గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. అలాగే మోడీ తీసుకున్న నిర్ణయాలు ఎలా వికటించాయో ప్రజలకు వివరిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ జోరు పెంచారు. సర్వేలన్నీ అనుకూలంగా ఉండటంతో తొలిసారి మోడీని ఓడిస్తున్నామన్న ధోరణిలో రాహుల్ మోడీపై విమర్శల జోరును పెంచారు.

మోడీ వన్నీ అబద్ధాలే....

ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన హామీలకు విలువలేదన్నారు రాహుల్ గాంధీ. ఆయన ప్రతి మాటలో అబద్ధం తొంగి చూస్తుందన్నారు. నిజాలు అస్సలు కన్పించవన్నారు. పేదల బ్యాంకు ఖాతాల్లో పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పిన మోడీ ఇంతవరకూ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మోడీ మాట నిలబెట్టుకోలేదన్నారు.

గనులు దోచుకున్న.......

కర్ణాటకలో గనులను దోచుకున్న గాలి సోదరులకు మాత్రం మోడీ అండగా నిలుస్తున్నారని రాహుల్ సెటైర్లు వేశారు. గాలి సోదరులను ఎన్నికల్లో నిలబెట్టి రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న అవినీతి పరులకు అండగా నిలిచారన్నారు. దేశాన్ని మోసం చేస్తున్న వారు విదేశాలకు వెళుతున్నా ప్రధాని మోడీ చోద్యం చూస్తున్నారన్నారు. బ్యాంకులను ముంచేసి వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నీరవ్ మోడీ విదేశాలకు చెక్కేస్తున్నా మోడీ చోద్యం చూస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే అమిత్ షా కుమారుడు జై షా కంపెనీలకు మాత్రం విపరీతమైన లాభాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.

Similar News