సరికొత్త గా అడుగులు

Update: 2018-03-31 20:30 GMT

దేశంలో చిన్న రాష్ట్రం అయినప్పటికీ అనేక అంశాల్లో కేరళ అందరికి ఆదర్శం. వంద శాతం సంపూర్ణ అక్షరాస్యత, అవినీతిరహిత రాష్ట్రంగా కేరళకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. మరో సంచలన సంస్కరణ దిశగా కేరళ ప్రజలు అడుగులు వేస్తూ స్ఫూర్తి వంతంగా నిలుస్తున్నారు. ఏదైతే రాజకీయనాయకులకు వరం ప్రజలకు శాపం అన్న రీతిలో నడుస్తున్న సమాజంలో.... ఎక్కడైతే వివేకవంతమైన సమాజం ఉంటుందో అక్కడ నుంచే ప్రక్షాళన మొదలౌతుంది చాటిచెబుతున్నారు. కులం మతం అడ్డుగోడలు కొలుస్తూ మనమంతా మానవ కులం అనేందుకు కూకటివెళ్లనుంచి ఆ జాడ్యం వదిలించేందుకు నడుం బిగించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ప్రజలు.

స్కూల్ దరఖాస్తుల్లో నో కులం నో మతం ...

కులం, మతం అనే భావాలకు పునాది వేసేవి విద్యా సంస్థలు. స్కూల్ దరఖాస్తుల్లో కులం.... మతం.... ఫలానా అని రాశాక వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ లోనే తేడా మొదలైపోతుంది. ఇది గుర్తించిన తల్లితండ్రులు ఇప్పడు కొత్తగా స్కూల్స్ లో జాయిన్ చేసే తమ పిల్లల వివరాలు నమోదు చేస్తూ కులం, మతం వున్న కాలమ్స్ బ్లాంక్ గా విడిచిపెట్టేస్తున్నారు. కేరళ విద్యామంత్రి అక్కడి అసెంబ్లీకి అందించిన వివరాల ప్రకారం మూడు లక్షల మంది తమ పిల్లలను జాయిన్ చేస్తే లక్షా 24 వేలమంది తమ కులం, మతం వివరాలను విద్యాసంస్థలకు నింపిన దరఖాస్తులో పేర్కొనకపోవడం విశేషం. ఇలా ఒక మంచి మార్పునకు కేరళ ప్రజలు శ్రీకారం చుట్టడం వెనుక సంపూర్ణ అక్షరాస్యతే కారణం అని చెప్పొచ్చు. ఎక్కడైతే విద్యా వంతమైన సమాజం ప్రకాశిస్తుందో అక్కడ ఆ పరిమళాలు కూడా ఆస్వాదించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ మార్పు దేశమంతా విస్తరించాలంటే ముందు సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు అన్ని రాష్ట్రాల్లో పడాలి.

Similar News