నాగపూర్ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారనే వార్త గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించిన నాటి నుంచి ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. అయితే, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఏం మాట్లాడనున్నారు, ఐదు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న ప్రణబ్ తన మనస్సు ఏమైనా మార్చుకుంటారా..?, ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా ఏమైనా మాట్లాడతారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రణబ్ ఇప్పటికే నాగపూర్ చేరారు. అయితే, ప్రణబ్ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ‘నో కామెంట్’ అని చెబుతున్నా, ఆ పార్టీ నేతలు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ఆయన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని కోరుతున్నారు. అయితే, కేవలం కాంగ్రెస్ నేతలే కాదు, స్వయానా ప్రణబ్ కుమార్తె షర్మష్ఠా ముఖర్జీ సైతం తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
తప్పుడు ప్రచారాలకు అవకాశం ఇస్తున్నారు....
ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకానున్న నేపథ్యంలో షర్మష్ఠా వరుస ట్వీట్లు చేసింది. ఇందులో ప్రణబ్ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరడంతో పాటు ఆర్ఎస్ఎస్, బీజేపీల పైన విమర్శలు కూడా చేసింది. ‘ఇవాళ జరగబోయే కార్యక్రమం తోనైనా మీరు బీజేపీ డర్టీ ట్రిక్స్ డిపార్టుమెంట్ గురించి గ్రహించాలని కోరుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ సైతం మీ స్పీచ్.. వారిని సమర్థించేలా ఉంటుందని భావించదు. కానీ, మీ స్పీచ్ ను మరిచిపోతారు, మీ ఫోటోలు, విజువల్స్ మాత్రం ఎప్పటికీ మిగిలి ఉంటాయి. వాటితో తప్పుడు సందేశాలు ప్రచారం చేస్తారు’, నాగపూర్ కి వెళ్లడం ద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తప్పుడు కథనాలు, అబద్ధపు ప్రచారాలు చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు’ అని తన తండ్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో పాటు తాను బీజేపీలో చేరినట్లు వచ్చిన వార్తలు షాక్ కు గురిచేశాయని, కాంగ్రెస్ పై ఉన్న నమ్మకంతోనే తాను రాజకీయాలకు వచ్చానని, ఒకవేళ కాంగ్రెస్ ను వీడాల్సి వస్తే రాజకీయాలనే వదిలేస్తానని షర్మష్ఠా స్పష్టం చేశారు.
20 నిమిషాల పాటు ప్రసంగం...
అయితే, ప్రణబ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకానుండటం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ప్రణబ్ నుంచి తాను ఈ చర్య ఆశించలేదని ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబడం స్పందిస్తూ ప్రణబ్.. ఈ కార్యక్రమానికి వెళ్లి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో తప్పును స్పష్టంగా చెప్పాలని కోరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి మాత్రం ప్రణబ్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది మంచి పరిణామమని, రాజకీయ అంటరానితనం అనేది సరికాదని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.