ప్ర‌కాశంలో టీడీపీ, వైసీపీ పిల్ల‌మొగ్గ‌లు.. రీజ‌న్ ఏంటి..?

Update: 2018-06-07 06:17 GMT

రాజ‌కీయంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ నేత‌లు టికెట్ ఫీట్ల‌లో ముందున్నారు. కొంద‌రు ఇప్ప‌టి నుంచే వారి వారి అనుచ‌రులతో టికెట్ల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ప్ర‌ధానంగా ఇక్క‌డి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు టికెట్ల కోసం పిల్లిమొగ్గ‌లు వేస్తున్న ప‌రిస్థితి స్పష్టంగా క‌నిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా యర్రగొండపాలెం (ఎస్సీ)నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన సిటింగ్‌ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుకు టీడీపీ అభ్యర్థిత్వంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన ఈసారి సంతనూతలపాడు(ఎస్సీ)కు మారే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మారనున్న అభ్య‌ర్థులు...

ఆయన ఇటు వస్తే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన బుడాల అజితారావు అక్కడ మళ్లీ అభ్యర్థి అవుతారని నేతలు భావిస్తున్నారు. మ‌రోప‌క్క టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్నే రవీంద్ర అభిప్రాయానికి పార్టీ నాయకత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ నుంచి కూడా ఈసారి మార్పు ఉంటుందని తెలుస్తోంది. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ ఈసారి యర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కూడా కొంతకాలంగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి తిరుగుతున్నారు.

టిక్కెట్ల కోసం పోటాపోటీ...

సంతనూతలపాడు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న విజయ్‌కుమార్‌కు పార్టీలో మొదటి నుంచీ ఉన్న నేతలతో సఖ్యత లేదు. అభ్యర్థిని మార్చే అవకాశం ఉందన్న అంచనాతో టికెట్‌ కోసం పోటీ పెరిగింది. లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ బాబుతోపాటు ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ యర్రగొండపాలెంకు మారడం ఖాయం కావడంతో గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబును వైసీపీ ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. కొండపి (ఎస్సీ) నుంచి టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే డీఎస్‌ బాలవీరాంజనేయస్వామి తిరిగి పోటీ చేయనున్నారు. ఇక్కడ టీడీపీలో కొంత అంతర్గత విభేదాలు ఉన్నాయి.

వైసీపీలో వ‌ర్గ‌పోరు...

ఇక్కడ టికెట్‌ కోసం ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు కూడా ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండగా.. ఆయన్ను మార్చాలని ఒక వర్గం గట్టిగా పట్టుపడుతోంది. మొత్తంగా ఇక్క‌డ టీడీపీ, వైసీపీ నాయ‌కులు టికెట్ల ఫీట్ల‌లో త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు. మ‌రి ఎన్నిక‌ల నాటికి ఎవ‌రికి టికెట్లు ల‌భిస్తాయో చూడాలి. అధినేత‌లు ఎవ‌రి మెడ‌లో వీర‌తాడు వేస్తారో చూడాలి.

Similar News