విద్యుత్తు కోతలు మొదలయ్యాయ్

విద్యుత్తు కోతలు మొదలయినట్లున్నాయి. తెలంగాణలో విద్యుత్ కోతలను అనధికారికంగా అధికారులు అమలు చేస్తున్నారు

Update: 2023-02-11 06:01 GMT

విద్యుత్తు కోతలు మొదలయినట్లున్నాయి. తెలంగాణలో విద్యుత్ కోతలను అనధికారికంగా అధికారులు అమలు చేస్తున్నారు. వేసవి కాలానికి ముందే విద్యుత్తు కోతలు ప్రారంభం కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయాలు కలగడం, గంటల తరబడి పవర్ కట్ చేస్తుండటంతో విద్యుత్తు కోతలను మొదలుపెట్టారని భావించాలి. విద్యుత్తు డిమాండ్ పెరగడంతోనే అధికారులు విద్యుత్తు కోతలను అనధికారికంగా అమలు చేస్తున్నారని చెబుతున్నారు.

కేసీఆర్ చెప్పిన దానికి...
కనురెప్ప మూసినంత సేపు కూడా తెలంగాణలో విద్యుత్తు కట్ చేయమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు భిన్నంగా అధికారులు అనధికార కోతలను అమలు చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే వేసవికాలం మాదిరి మారిపోవడం, విద్యుత్తు డిమాండ్ పెరగడంతో అధికారులు నిస్సహాయతగా మారి కోతలు అమలు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్తు కోతలు ఎక్కువగా ఉంటాయన్న అంచనాలు వినపడుతున్నాయి.
ఆల్ టైం రికార్డు...
విద్యుత్తు వినియోగం తెలంగాణలో ఈరోజు ఆల్ టైం రికార్డు సృష్టించింది. నిన్నటి కంటే ఈరోజు అధికంగా విద్యుత్తు వినియోగం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు పది గంటలకే 14,350 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. నిన్నటితో పోలిస్తే మరింత ఎక్కువగా ఉంది. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. గత ఏడాది ఇదే రోజున 14,129 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్తును 24 గంటలు సరఫరా చేయాలని ఆందోళనలు మొదలయ్యాయి. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు కోతలను అనధికారికంగా అమలు చేస్తున్నారని తెలిసింది.


Tags:    

Similar News