పీతలను జగన్ వదిలేశారా?

Update: 2018-05-18 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో జరిగినట్లుగానే ఆయన పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది. జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో మూడో రోజుకు చేరకుంది. ఇప్పటి వరకూ దెందులూరు నియోజకవర్గంలో పర్యటించారు. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయతే జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం పదమూడు నియోజకవర్గాల్లో నుంచే వెళుతుంది. మొత్తం 15 నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాల్లో జగన్ పర్యటించకపోవడం చర్చనీయాంశమైంది.

రూట్ మ్యాప్ లో లేకపోవడంతో......

ముఖ్యంగా చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలు జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ లో లేవు. పోలవరం నియోజకవర్గాన్ని పక్కన పెడితే చింతలపూడి నియోజకవర్గం వెళ్లకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చింతలపూడి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో పీతల సుజాత జగన్ పై ఒంటికాలి మీద లేచే వారు. అలాగే పీతలపై కూడా వైసీపీ నుంచి అనేక ఆరోపణలు చేసింది. ముఖ్యంగా గ్రానైట్ వ్యాపారుల నుంచి బంగారు వడ్డాణం గిఫ్ట్ గా పొందారని అప్పట్లో పీతలపై విమర్శలు చేసింది వైసీపీ. ప్రధానంగా రోజా ఈవిషయంలో ముందున్నారు. అలాంటిది పీతల సుజాత నియోజకవర్గంలో పర్యటించకపోవడంపై ఆ పార్టీలోనూ ఆసక్తి కర చర్చ జరుగుతోంది.

నిరాశలో చింతలపూడి వైసీపీ నేతలు.....

పీతల సుజాత నాన్ లోకల్ అయినా ఇక్కడ గెలిచారు. గత ఎన్నికల్లో పీతల సుజాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి దేవీప్రియపై దాదాపు పదివేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే జగన్ పాదయాత్రతో చింతలపూడి నియోజకవర్గంలో పట్టుపెంచుకుందామనుకున్న స్థానిక నేతలకు అది లేదని తేలిపోవడంతో నిరాశ చెందారు. జగన్ పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో పర్యటించి ఉంటే వైసీపీకి కొంత ఊపు వచ్చేదన్న అభిప్రాయం స్ధానిక నేతల్లో వ్యక్త మవుతోంది. అయితే చింతలపూడి నియోజకవర్గానికి పాదయాత్ర పూర్తయిన తర్వాత బస్సుయాత్రలో జగన్ వస్తారని వారికి పాదయాత్ర నిర్వాహకులు సర్ది చెప్పారు. మొత్తం మీద జగన్ పీతలను వదిలేశారేంటన్న వ్యాఖ్యలు జిల్లాలో విన్పిస్తున్నాయి.

Similar News