జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన స్వరం మరింత పెంచారు. తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటన సాగుతోంది. మరో నాలుగు రోజులు పవన్ పశ్చిమలో పర్యటించనున్నారు. ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీలనే టార్గెట్ చేస్తూ ఆయన పర్యటన సాగుతోంది. ఇప్పటి వరకూ అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని చెబుతూ వచ్చిన పవన్ కల్యాణ్ లో ఇప్పుడు మార్పు కనపడుతోంది. ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి చేరాలని ఆయన కార్యకర్తలకు పిలుపు నివ్వడం విశేషం.
జగన్ పారిపోయాడు......
ఇక పవన్ తన పర్యటనలో చంద్రబాబు, లోకేష్ తో పాటు జగన్ ను కూడా వదిలిపెట్టడం లేదు. యనమదుర్రు మురుగుకాల్వ కంటే తెలుగుదేశం అవినీతి, జగన్ దోపిడీ కంపు కొడుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జగన్ ప్రభుత్వం పై పోరాడలేకనే ప్రతిపక్ష పాత్ర పోషించలేక పారిపోయారని చెప్పారు. జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా తాను సంయమనం పాటించానని చెప్పారు. తాను వ్యక్తిగత జీవితంలోకి వెళితే జగన పారిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
15 సీట్లు ఇచ్చినా......
చంద్రబాబు పదిహేను సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాకు ఈ నాలుగేళ్లలో ఒక డంపింగ్ యార్డుకూడా ఇవ్వలేదన్నారు. జన్మభూమి కమిటీలను తాను ప్రశ్నించిన తర్వాతనే వాటిని రద్దు చేశారన్న విషయాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తాగునీటి సమస్య ఉండటం బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుభవాన్ని గుర్తించే తాను గత ఎన్నికల్లో మద్దతిచ్చానని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పదిహేను సీట్లను జనసేనకు ఇవ్వాలన్నారు. ప్రజల పక్షాన పోరాడే జనసేన అధికారం లేకపోయినా సమస్యలపై పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఇటు టీడీపీ అటు వైసీపీని టార్గెట్ చేసుకుంటూ పశ్చిమలో పర్యటిస్తున్నారు.