విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తూ సంపద సృష్టితో సమస్యలకు చెక్ పెడతామంటూ జనసేన మ్యానిఫెస్టో సిద్ధం అవుతుందని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఈనెల 14 న అమరావతిలో జనసేన ప్రీ మ్యానిఫెస్టో విడుదలకు దాదాపుగా రంగం సిద్ధమైంది. లెఫ్ట్ పార్టీలు, పలు రంగాలకు చెందిన మేధావులతో మ్యానిఫెస్టో పై జనసేన దాదాపు కసరత్తు చేసేసింది. తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్నికల హామీల కమిటీ సుదీర్ఘ భేటీల అనంతరం దీనిని రూపొందించారని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా జనసేన జనం ముందుకు తన అజెండాను తీసుకురానుంది.
కాపు రిజర్వేషన్ లపై ...?
ఏపీలో కీలకమైన కాపు రిజర్వేషన్ అంశం పై ఇప్పటివరకు జనసేన తన వైఖరిని స్పష్టంగా ప్రకటించలేదు. కాపు ఉద్యమ సమయంలో కానీ పవన్ సభల్లో జనం ప్రశ్నించిన సమయంలో కానీ జనసేనాని దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. దాంతో కాపు సామాజిక వర్గం కొంత అసంతృప్తి చెందుతుంది. స్పష్టమైన విధానం తమ నేత తెలియచేయాలని కోరుకుంటుంది. ఇప్పటికే అత్యధిక కాపు సామాజికవర్గం జనసేనలో కీలక బాధ్యతలతో పాటు పార్టీని ముఖ్యంగా గోదావరి జిల్లాలలో భుజాన మోస్తుంది.
అనుకూలంగానే.....
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇతర సామాజికవర్గాలు ఎక్కడ దూరం అవుతాయో అన్న భయంతో తన వైఖరి స్పష్టం చేయకుండా నానుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మ్యానిఫెస్టో లో ఈ కీలక అంశంపై అట్టో ముక్కో తేల్చక తప్పదని అంతా ఎదురు చూస్తున్నారు. కాపు రిజర్వేషన్లకు తాము అనుకూలమేనని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని మ్యానిఫేస్టోలో పొందుపర్చ నున్నారు. అలాగే కాపులకు అనుకూలంగానే మేనిఫేస్టోలో నిర్ణయం ఉంటుందంటున్నారు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.