పవన్ మీడియా పోరాటం కొనసాగుతుందే....?

Update: 2018-05-22 10:30 GMT

పవన్ కళ్యాణ్ వెర్సెస్ కొన్ని ఛానెల్స్ పోరాటం ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తుంది. టిడిపి అనుకూల ఛానెల్స్ గా కొన్ని మీడియా సంస్థలపై జనసేనాని బ్యాన్ విధించారు. తన తల్లి ని అవమానించేవిధంగా చర్చలు నిర్వహించారని టిడిపి వెనుక నుంచి కుట్ర చేసిందన్నది పవన్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్స్ చూడొద్దంటూ, చిన్న పిల్లలు కూడా చెడిపోతారంటూ రక రకాలుగా పవన్ వరుసగా కొద్ది రోజులు ట్వీట్ లతో యుద్ధం సాగించారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది. కొన్ని ఛానెల్స్ పవన్ పై న్యాయపోరాటానికి దిగడం అలాగే పరువు నష్టం కేసులు దాఖలు చేశాయి. ఇదంతా ఒక పక్క నడుస్తూనే వుంది.

ఉత్తరాంధ్రలో వాటికి దూరంగా ...

తాజాగా ఉత్తరాంధ్ర లో ప్రజాపోరాట యాత్ర ప్రారంభించిన జనసేన అధినేత తాను బ్యాన్ చేసిన మీడియా ను దగ్గరకే రానీయడం లేదు. కొన్ని ఛానెల్స్ లోగులతో వున్న మైకులను చేతిలో పట్టుకుని వాటినే గుర్తిస్తున్నట్లు జనసైనికులకు చెప్పకుండా చెప్పారు. కొన్ని ఛానల్స్ లోగోలు మాత్రమే పవన్ చేతిలో కనిపిస్తున్నాయి. ఆ లోగోలతో కూడిన మైకులు పట్టుకునే ఆయన ప్రసంగాలు చేయడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో పవన్ బ్యాన్ చేసిన మీడియా సంస్థకు చెందిన పాత్రికేయులపై జనసైనికులు ఘర్షణకు దిగి వారిని ఆయా కార్యక్రమాలనుంచి బహిష్కరిస్తున్నారు. జనసేన అనుసరిస్తున్న ఈ విధానం మీడియా వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు పవన్ మాత్రం తనకు ఇష్టం లేని మీడియా ను దూరంగా పెట్టడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విశ్వసనీయత తగ్గడం, పార్టీల మీడియా ఏర్పడటంతో గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని ప్రస్తుతం మీడియా ఎదుర్కొంటుందన్నది నేటి పరిస్థితులు రుజువు చేస్తున్నాయి.

Similar News