పవన్ ను బాబు ఇక నేరుగా..?

Update: 2018-06-02 07:30 GMT

పవన్ పై నేరుగా దాడికి దిగుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇన్నాళ్లూ పవన్ పట్ల కొంత సానుకూలత ప్రదర్శించిన చంద్రబాబు ఇక నేరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఆయన పవన్ పై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి సమర్థ నాయకత్వం అవసరమని పవన్ ఆనాడు చంద్రబాబుకు మద్దతిచ్చానని చెబుతున్నారు. కాని గత కొంతకాలంగా చంద్రబాబు ప్రభుత్వంపైనా, ఆయన తనయుడు లోకేష్ పైనా నేరుగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న....

అయినా ఓపిక పట్టిన చంద్రబాబు ఇంతకాలం మౌనంగానే ఉన్నారు. పరోక్షంగా పవన్ పై విమర్శలు చేశారు తప్పించి నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కాని నవనిర్మాణ దీక్షలో మాత్రం ఆయన పవన్ పైనే నేరుగా విమర్శలు చేయడం విశేషం. తాను బీజేపీతో కలసి ఉన్నంత వరకూ పవన్ తనపై ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు చంద్రబాబు. తాను బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఆయన తనపైనా, ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారని, దీన్నిబట్టి పవన్ కల్యాణ్ వెనక ఎవరున్నారో తెలిసిపోతుందన్నారు.

పావుగా మారారని.....

ఉత్తరాంధ్రలో పవన్ ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు. విభజన సమయంలో స్పందించని పవన్, ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడని పవన్ ఇప్పుడు పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా కొందరు పన్నుతున్న కుట్రలో పవన్ భాగస్వామిగా మారిపోయారన్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీలో ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని చూస్తుందని, దీన్ని ప్రజలంతా సంఘటితంగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. రాయలసీమ డిక్లరేషన్ తో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని బీజేపీచేస్తుందన్నారు.

తిరుమలను కూడా.......

ఇక సెంటెమెంట్ ను కూడా చంద్రబాబు రాజేస్తున్నారు. తిరుమల, తిరుపతి దేవస్థానం విషయంలోనూ బీజేపీ రాజకీయాలు చేయాలనిచూస్తుందన్నారు. రమణ దీక్షితులను అడ్డంపెట్టుకుని నగలు పోయాయని, లేని వజ్రం మాయమయిందని ప్రచారం చేస్తుందన్నారు. వెంకటేశ్వరస్వామితోనే బీజేపీ ఆటలాడుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ ప్రారంభమయిందన్న చంద్రబాబు తమిళనాడులాగా ఇక్కడ ఆటలు సాగనివ్వబోమన్నారు. పురావస్తు శాఖ అధీనంలోకి తిరుమలను తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాన్ని ప్రజలు విజయవంతంగా తిప్పికొట్టారన్నారు. బీజేపీ చేతిలో జగన్, పవన్ పావులుగా మారిపోయారన్నారు.

Similar News