తనపై కుట్ర జరుగుతుందన్న జనసేన పవన్ కల్యాణ కు ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. సీపీఎం, సీపీఐ, బీజేపీలు పవన్ తల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూనే పవన్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కు మద్దతు తెలుపుతూ లేఖ రాశారు. లేఖలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ముద్రగడ దుయ్యబట్టారు. ఒక మెట్టు దిగి అవకాశం ఉన్నంత మేరకు ఇతర పార్టీల సహకారం తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పవన్ కు ముద్రగడ తన లేఖలో సూచించారు.
అడ్డంపెట్టుకుని అధికారంలోకి వచ్చి.....
గత ఎన్నికల్లో కాపు సామాజకి వర్గాన్ని, పవన్ ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను తొలుత టార్గెట్ చేసిన చంద్రబాబు పోలీసులతో కొట్టించారన్నారు. కాపు రిజర్వేషన్లపై తాను దీక్ష చేస్తే తన భార్య, కోడలిని కూడా పోలీసులతో ఈడ్చుకుని వచ్చారని ముద్రగడ ఆవేదన చెందారు. అటువంటి చంద్రబాబును పవన్ భుజాలపైకి ఎక్కించుకుని ఊరూ వాడా తిరిగి చంద్రబాబు సమర్థుడని, నాయకత్వ పటిమ కలవారని చెబుతూ ఆయనకు అధికారం అప్పగించారని పవన్ కు తన లేఖలో గుర్తు చేశారు ముద్రగడ.
టీడీపీని నిమజ్జనం చేయండి.....
"మీ తల్లికి జరిగిన అవమానం నాకు బాధ కల్గించింది. ఆ బాధను కొద్దిగా పక్కన పెట్టి రోడ్డు మీదకు వచ్చి టీడీపీని సముద్రంలో నిమజ్జనం చేసే వరకూ ఇంటి మొహం చూడొద్దు" అని ముద్రగడ తన లేఖలో పవన్ ను కోరారు. ఆక్వా పార్క్ ఏర్పాటును నిరసిస్తూ తుందూరు రైతులు పవన్ వద్దకు వస్తే వారిపై అక్రమ కేసులు బనాయించారని ముద్రగడ ఆరోపించారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని నమ్మవద్దని ఆయన తన లేఖలో పవన్ ను కోరారు. న్యాయపోరాటం మాత్రం చేయవద్దని, ఒక మెట్టు దిగి అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాలని ముద్రగడ పవన్ కు తన లేఖలో సూచించారు.