జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ మరికొద్ది గంటల్లో ముగుస్తోంది. దీంతో ఆయన ఆమరణ దీక్షకు దిగుతారా? అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఉద్దానం పర్యటించిన సందర్భంగా అక్కడి వ్యాధిపీడితులను చూసి చలించిపోయారు. వెంటనే ఉద్దానం బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా స్పందించకుంటే తాన ఆమరణ దీక్షకు దిగుతానని ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా విధించారు.
నేడు కూడా విరామమేనా?
తన సెక్యూరిటీ సిబ్బందికి గాయాలు కావడంతో నిన్న పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి పవన్ డెడ్ లైన్ మీద ఎటువంటి స్పందన రాలేదు. కొందరు మంత్రులు మాట్లాడినా తాము ఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకుంటున్నామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారే గాని పవన్ డిమాండ్ పై ఎటువంటి స్పందన మంత్రుల నుంచి రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకూడా పవన్ డెడ్ లైన్ పై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
ఎప్పుడో ఒకసారి వచ్చి......
మరోవైపు డిప్యూటీ సీఎం చినరాజప్ప మాత్రం ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాము ఉద్దానం బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా వ్యాధిపీడితులకు నెలకు 2,500లు ఆర్థిక సాయం కూడా చేస్తున్నామని, అందరికీ రక్త పరీక్షలు నిర్వహించామని, సంచార వైద్యశాలలను కూడా ఏర్పాటు చేశామన్నారు. పవన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడం మానుకోవాలని చినరాజప్ప కోరారు.
పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు.....
తాను విధించిన డెడ్ లైన్ పై ఎటువంటి స్పందన రాకపోవడంతో మరికొద్ది సేపట్లో పవన్ కల్యాణ్ ఆమరణ దీక్షకు దిగే అవకావముందంటున్నారు. ఇందుకోసం పవన్ బస చేసిన ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ ఆమరణ దీక్షకు దిగితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరి పవన్ ఆమరణ దీక్షకు దిగుతారా? లేదా? అన్నది చూడాలి.