జనసేన అధినేత పవన్ కల్యాణ మరోసారి తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు రెండేళ్ల ముందే మేలుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ కు ఈ దుస్థితి దాపురించి ఉండేది కాదని పవన్ తీవ్ర విమర్శలు చేశారు. కాని నాలుగేళ్లుగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే అరాచకాలకు దిగుతున్నారన్నారు. తాను బస చేసే చోట విద్యుత్తును తీసేయడమేకాకుండా, అవినీతిని ప్రశ్నించిన జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులను బనాయించారని పవన్ ఆరోపించారు.
ఆయన దీక్షలో ధర్మం లేదు.......
చంద్రబాబు రాష్ట్రానికి ఏదో మంచి చేస్తారని తాను గత ఎన్నికల్లో మద్దతిచ్చానని, అయితే ఆయన ప్రభుత్వం అవినీతిలో దేశంలోనే రెండో స్థానంలో ఉందని పవన్ విమర్శించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆయనకు ఇప్పటి వరకూ ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షల్లో ధర్మం లేదన్న పవన్ అవి కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
డిపాజిట్లు కూడా రావు.....
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని పవన్ జోస్యం చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలకే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, మిగిలిన వారు ప్రజలు కాదా? అని ఆయన నిలదీశారు. సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు పాలన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉత్తరాంధ్రను నాశనం చేయడానికే అణువిద్యుత్తు ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చిందన్నారు.
రాజుగారంటే గౌరవమే కాని.....
మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుపైన కూడా పవన్ సెటైర్లు వేశారు. గత ఎన్నికల సమయంలో అశోక్ గజపతిరాజుకు మద్దతుగా తాను ప్రచారం చేశానని, అప్పుడు ఆయనకు తెలిసిన పవన్ ఇప్పుడు తెలియదంట అంటూ ఎద్దేవా చేశారు. ఆయన పట్ల తనకు గౌరవం ఉందని, ఆయన ఉత్తరాంధ్ర సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుందని పవన్ హితవు పలికారు. మొత్తం మీద ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ మరోసారి టీడీపీపై నిప్పులు చెరిగారు.