పాకిస్థాన్ మైనారిటీలకు భారత్ శుభవార్త

Update: 2018-07-17 08:03 GMT

భారత్ లో దీర్ఘకాలిక వీసాలపై ఆశ్రయం పొందుతున్న 30 వేల మంది పాకిస్థానీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రం తీసుకువచ్చిన నూతన విధానం ద్వారా భారత్ లో దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తున్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లకు చెందిన మైనారిటీ వర్గాలకు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు భారత్ లో ఇళ్లు కట్టుకోవచ్చు. ఈ వీసాలపై భారత్ లో ఉంటున్నవారిలో పాకిస్థాన్ హిందువులే ఎక్కువ. వారి కుటుంబ నివసించేందుకు, ఉపాధి పొందేందుకు అవసరమైన గృహాన్ని వారు ఏర్పాటుచేసుకోవచ్చు. కేవలం కంటోన్మెంట్ ఏరియా వంటి నిషేధిత ప్రాంతాలు మినహా ఎక్కడైనా ఇళ్లు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా దేశాలకు చెందిన మైనారిటీ వర్గాల ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పాన్, ఆధార్ కార్డులు కూడా...

2011 నుంచి పాకిస్థాన్ కు చెందిన 30 వేల మందికి భారత్ దీర్ఘకాలిక వీసాలను మంజూరు చేసింది. ఆ తర్వాత వారికి పాన్ కార్డు, ఆధార్ కార్డులను కూడా మంజూరు చేసింది. ఇలా భారత్ లో దీర్ఘకాలిక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎక్కువగా పాకిస్థాన్ కి చెందిన వారే ఉంటున్నారు. కేవలం గత సంవత్సరం 6,092 మంది పాకిస్థాన్ జాతీయులకు ఈ వీసాలు మంజూరయ్యాయి. 2011 నుంచి 2014కి మధ్య 14,726 మంది పాకిస్థానీయులకు వీసాలు మంజూరైనట్లు లెక్కలు చెబుతున్నాయి.

Similar News