ఆపరేషన్ గరుడ స్టార్ట్ అయింది

Update: 2018-04-08 02:30 GMT

దక్షిణాది రాష్ట్రాలపై ఆపరేషన్ గరుడ నిజమేనని సినీనటుడు శివాజీ మరోసారి పునరుద్ఘాటించారు. ఆయన మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆపరేషన్ గరుడ ఇప్పటికే ప్రారంభమైందన్నారు శివాజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన శివాజీ తాను చెప్పిన ఆపరేషన్ గరుడ స్టార్ట్ అయిందన్నారు. ఇందుకు తగిన ఆధారాలు తనవద్ద లేకపోయినా ఇది ముమ్మాటికీ నిజమని ఆయన మరోసారి తేల్చి చెప్పారు.

ఇప్పటికే డబ్బులు చేరిపోయాయి....

ఆపరేషన్ గరుడ పేరిట దక్షిణాది రాష్ట్రాలపై ఒక జాతీయ పార్టీ భారీ ఎత్తున డబ్బులు ఖర్చుపెడుతుందని హీరో శివాజీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆపరేషన్ గరుడ మొదలయిందని చెప్పిన ఆయన ఎవరికి చేరాల్సిన డబ్బులు వారికి చేరిపోయాయన్నారు. అయితే గరుడ నిర్వహించిన ఈ ఆపరేషన్ లో డబ్బులు చేరినా ఎవరికీ రశీదులు ముట్టవని చెప్పారు.

అన్నింటికీ రశీదులుండవ్.....

పవన్ కల్యాణ్ ఇటీవల లోకేష్ పై చేసిన ఆరోపణలకు కూడా రశీదులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ప్రతి ఆరోపణలకూ సాక్ష్యాలను చూపలేమని, లోపాయికారీగా జరిగే పనులు తనకు తెలిసి వాటిని బయపెట్టానని శివాజీ తెలిపారు. ఆపరేషన్ గరుడ అత్యంత ప్రమాదకరమైనదని, దక్షిణాది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అఖిలపక్ష సమావేశానికి కొన్ని పక్షాలు హాజరు కాకపోవడంపై శివాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కలసి కట్టుగా ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా సాధించగలమని శివాజీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News