గుడివాడ ఫీడ్ బ్యాక్... జనసేనాని సైలెన్స్ అందుకేనట

కొడాలి నాని ఎపిసోడ్ లో ఒక విషయం స్పష్టమయింది. ఈ వివాదానికి జనసేన దూరంగానే ఉన్నట్లు కన్పించింది.

Update: 2022-01-26 02:56 GMT

కొడాలి నాని ఎపిసోడ్ లో ఒక విషయం స్పష్టమయింది. ఈ వివాదానికి జనసేన దూరంగానే ఉన్నట్లు కన్పించింది. కారణాలు ఏవైనా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీనిపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత వారం రోజులు నుంచి గుడివాడలో క్యాసినో నిర్వహించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏ టీవీ చూసినా గుడివాడ పేరే. ఏ పేపర్ చూసినా గుడివాడకు చెందిన వార్తలే.

కొడాలి నాని వ్యవహారంలో....
గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారని, తెలుగు సంస్కృతిని మంట గలుపుతున్నారని టీడీపీ నేతలు వారం రోజుల నుంచి గోల గోల చేస్తూనే ఉన్నారు. మంత్రిని కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ కూడా వేశారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించింది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు పెద్దయెత్తున నినాదాలు చేసి అరెస్ట్ అయ్యారు కూడా.
క్యాసినో విషయంలో....
కానీ జనసేన విషయమే అర్థం కాకుండా ఉంది. కొడాలి నాని, పేర్ని నాని అంటే దూకుడు మీద ఉండే పవన్ కల్యాణ్ ఈసారి ఎందుకో సైలెంట్ గా ఉన్నారు. జనసేన నుంచి కూడా పెద్దగా క్యాసినో వ్యవహారంపై స్పందన కన్పించలేదు. పవన్ కల్యాణ‌్ మామూలుగా అయితే కొడాలి నాని విషయంలో ఊరుకునే రకం కాదు. ఆయన ఖచ్చితంగా క్యాసినో వ్యవహారాన్ని యాగీ చేసేవారు. కానీ కారణం తెలియదు కాని నాని విషయంలో జనసేన పార్టీ సైలెంట్ గా ఉండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారా?
అయితే గతంలో గుడివాడ వెళ్లి పవన్ కల్యాణ్ నానిపై సవాల్ విసిరి కూడా వచ్చారు. గుడివాడలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. గుడివాడ జనసేన నేతల నుంచి పవన్ కల్యాణ్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారా? లేక తాను ఇన్ వాల్వ్ అయితే అంశం పక్కదోవ పడుతుందని భావించారో తెలియదుకాని, గుడివాడ వ్యవహారంలో జనసేనాని గుట్టుగా ఉండటం మాత్రం జనసైనికులకు మింగుడు పడటం లేదు.


Tags:    

Similar News