తెలుగు వారి గుండెల్లో కొలువైన నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు జీవితం భావితరాలు గుర్తుంచుకునేలా ఉండాలన్నారు ఆయన తనయుడు హరి కృష్ణ . ఎన్టీఆర్ ఘాట్ లో తారకరాముని జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. ప్రతి విద్యార్థికి ఆయన జీవితం ఆదర్శమని కనుక తెలుగు రాష్ట్రాలు ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యాంశాలు పుస్తక రూపంలో చిన్నారులు తెలుసుకునేలా చేయాలని కోరారు. నవరత్నాల్లో ఎన్టీఆర్ వజ్రం వంటివారని కీర్తించారు. తెలుగువారి ఖ్యాతిని ఢీల్లీ ఎర్రకోటపై జెండా పాతి చాటి చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కీర్తి ఎప్పటికి చిరస్థాయిగా నిలిచే ఉంటుందని తన తండ్రికి నివాళి అర్పించారు హరికృష్ణ. తాత ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ ఘనంగా నివాళి సమర్పించారు.
మహానాడులో తమ్ముళ్లు ...
ఇక అమరావతిలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. ఈరోజు భోజనాలైతే వెరీ వెరీ స్పెషల్ గా సిద్ధం అవుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు తెలుగు తమ్ముళ్ళు దండలు వేసి ఆయన్ను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ఆదర్శాలను వల్లెవేస్తూ ఆయన అందరికి స్ఫూర్తి అని కీర్తించారు. కేంద్రంపై భవిష్యత్తు పోరాటాలకు కీలక తీర్మానాలకు మాహానాడు వేదిక గా నిలవనుంది.
వెన్నుపోటు పొడిచి ...
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ప్రజా సంకల్ప యాత్రలో జగన్ చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసి ఆయన పుట్టిన రోజును చంద్రబాబు జరపడాన్ని ఎద్దేవా చేశారు. అలా చేయడం చంద్రబాబు కె చెల్లిందని ధ్వజమెత్తారు. బాబు తెలుగుదేశం లో అన్ని అక్రమాలు అన్యాయాలు ప్రజా వ్యతిరేక పాలన తప్ప ఏమిలేదని విమర్శల వర్షం కురిపించారు జగన్.