ఎన్టీఆర్ శతజయంతి.. నివాళులు అర్పించిన వారసులు, ప్రముఖులు

వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకుతో ..

Update: 2022-05-28 05:32 GMT

అమరావతి : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. ఆయన శతజయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వారసులు, ప్రముఖులు నివాళులు అర్పించారు. నటసార్వభౌముడి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అదే సమయంలో అభిమానులు భారీ ఎత్తున ఘాట్ వద్దకు చేరుకున్నారు. జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అంతకుముందు లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఫొటోతో ట్వీట్ చేశారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా".. అని రాసుకొచ్చారు.
అలాగే ఎన్టీఆర్ కుమార్తె, కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి నుంచి వచ్చే ఏడాది మే 28వ తేదీ వరకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. శతజయంతి ఉత్సవాల కోసం తెలుగురాష్ట్రాల్లో 12కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశామని, అందులో బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు కూడా ఉన్నట్టు చెప్పారు. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకుతో చర్చలు జరుపుతున్నట్టు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.










Tags:    

Similar News