ఓటుకు నోటు కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కెలికిన వేశా విశేషమేమోకాని, ఏపీలో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఓటుకు నోటు కేసులో పురోగతిపై కేసీఆర్ ఇటీవల సమీక్షించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీలో అగ్గిరాజుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే ఏకంగా చంద్రబాబును ఈ కేసులో జైలుకు పంపాల్సిందేనన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన చంద్రబాబు దోషి అని తేలిందన్నారు జగన్. తప్పుడు మార్గంలో ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడం చంద్రబబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. ఈ కేసును వెంటనే పరిష్కరించి దోషులను శిక్షించాలని జగన్ కోరారు.
సీనియర్ నేతలతో సమావేశం....
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుకూడా సీనియర్ నేతలతో ఓటుకు నోటు కేసు విషయంలో సమావేశమై చర్చించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు తదితరులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసు విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చర్చించారు. తమకు ఎటువంటి సంబంధం లేకున్నా అనవసరంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈకేసును మరోసారి బయటకు తెచ్చారని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి విషయంలో ఆగ్రహంగా ఉన్న కేసీఆర్ ఈ కేసును మరోసారి తిరగదోడాలనుకుంటున్నారని, అయితే ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని, భయపడాల్సిన అవసరం లేదని కూడా చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
బీజేపీ కూడా.....
మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ఈ కేసు విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అప్పీల్ చేసింది. ఈకేసును నీరుగార్చ వద్దంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి కేసీఆర్ ను కోరడం విశేషం. చంద్రబాబు ఫోన్ లో సంభాషించిన మాటలపై ఫోరెన్సిక్ నివేదకను ప్రజల ముందు ఉంచాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇలా వైసీపీ, బీజేపీలు ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇలాంటివి తాము చాలా చూశామని, వైఎస్ హయాంలో తమ నేతమీద 62 కేసులు నమోదు చేసినా, కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటపడ్డారని చెబుతున్నారు. మొత్తం మీద ఓటుకు నోటు కేసును మరోసారి కెలికి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్గిరాజేశారు.