నేడు బీజేపీ, టీడీపీ నేతలు కలసి ఒకే వేదికను పంచుకోనున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు పోలవరం సందర్శనకు రానున్నారు. గడ్కరీ పర్యటనకు దూరంగా ఉండాలని చంద్రబాబుకు మంత్రులు సూచించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులు గడ్కరీతో వేదికను పంచుకోవడం తప్పుడు సంకేతాలను పంపుతుందని చంద్రబాబుకు నేరుగా చెప్పారు. అయితే మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు లు మాత్రం గడ్కరీ పర్యటనలో పాల్గొంటేనే మేలని సూచించారు.
గడ్కరీ పర్యటనలో పాల్గొనాలని...
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గడ్కరీ పర్యటనలో పాల్గొనాలనినిర్ణయించుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై గడ్కరీ స్వయంగా సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా కేంద్రమే భరించాల్సి ఉంది. విభజన చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం పోలవరానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ వస్తున్నామని కేంద్రం చెబుతోంది. అయితే బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించడం లేదని టీడీపీ ఇంటా, బయటా ఆరోపిస్తోంది.
నిధులు ఇవ్వాలంటూ....
పోలవరం ప్రాజెక్టుకు 2,300 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా ఇంకా కేంద్ర ప్రభుత్వం పంపలేదని తెలుగుదేశం చెబుతోంది. అంతేకాకుండా 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణకు, పునరావాసానికి అంచనాలు మూడు వేల కోట్ల నుంచి ముప్ఫయి మూడు వేల కోట్లకు పెరిగాయని టీడీపీ చెబుతోంది. వెంటనే పదివేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే భూసేకరణతో పాటు పునరావాస పనులు, ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలమని టీడీపీ అంటోంది.
పర్యటనకు ప్రాధాన్యత.....
కాని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు నేరుగా విజయవాడ చేరుకునే గడ్కరీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోకలసి పోలవరం వెళతారా? విడివిడిగానే వెళతారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే ఎలా వచ్చినా అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. చంద్రబాబు కూడా గడ్కరీతో నేరుగా మాట్లాడి కేంద్రానికి పోలవరం ప్రాజెక్టుపై ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేయాలని భావిస్తున్నారు. చాలా రోజుల తర్వాత బీజేపీ, టీడీపీ ముఖ్యనేతలు ఒకే వేదికను పంచుకుంటుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.