గడ్కరీని కోరిందిదీ...ఆయన చెప్పిందిదీ...!

Update: 2018-07-11 13:09 GMT

కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఇద్దరూ కలసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని చంద్రబాబు గడ్కరీకి వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా కేంద్రం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఆర్థికంగా కష్టాల్లో ఉందని, నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు గడ్కరీని కోరారు. మేజర్ పనులన్నింటినీ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 2019 ని టార్గెట్ గా పెట్టుకుని పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. భూ సేకరణ, పునరావాస ప్యాకేజీలకు కేంద్రం సహకరించాలని కోరారు. ప్రతి సోమవారం తాను పోలవారం గా మార్చుకున్నానని, సమీక్ష చేస్తున్నానని చెప్పారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు 57,940 కోట్లవుతుందని, భూసేకరణకు 33 వేల కోట్లు అవసరమని చంద్రబాబు వివరించారు.

సాంకేతిక సమస్యలే తప్ప.....

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని తమను ఆదేశించారని చెప్పారు. పోలవరం ఏపీకి మాత్రమే కాదని దేశానికి కూడా కీలకమైన ప్రాజెక్టు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు రైతులకు కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు. త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంట్రాక్టరును కోరామన్నారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. పనులను త్వరగా పూర్తి చేసేందుకు కొంత నిధులను అడ్వాన్స్ గా ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారన్నారు. భూసేకరణ, పునరావాసం కోసం నిధులు చెల్లించాలంటే ఫైనాన్స్ కమిషన్ అనుమతి కావాలని గడ్కరీ చెప్పారు.

ఖర్చు రెట్టింపు కావడంతో....

పోలవరం భూసేకరణ ఖర్చు దాదాపు రెట్టింపయిందన్నారు. సాంకేతికంగా దీనిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పెరిగిన ప్రాజెక్టు అంచనాలను ఆర్థిక శాఖకు పంపిస్తామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదన్నారు. ప్రాజెక్టు వేరు రాజకీయాలు వేరన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులుమూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారన్నారు. నిధుల ఆలస్యం కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని చెప్పారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం విషయంలో అడిగిన అంశాలపై గడ్కరీ పూర్తి స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. ఆర్థిక శాఖ అనుమతి అవసరమని ఆయన చెప్పడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి ఆయనకు నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరారు.

Similar News