వైఎస్సార్ కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకున్నార‌ని బాబుకు చెప్పా

Update: 2018-07-20 17:11 GMT

ప్ర‌త్యేక హోదాతో స‌మానంగా ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టిస్తే ఒప్పుకున్న చంద్ర‌బాబు నాయుడు త‌న వైఫ‌ల్యాల‌ను కప్పిపుచ్చుకునేందుకే యూట‌ర్న్ తీసుకున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విమ‌ర్శించారు. అవిశ్వాస తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడుతూ...అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ మూడు కొత్త రాష్ట్రాల‌ను చేశార‌ని, కానీ ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా శాంతి, సామ‌ర‌స్యంతో అభివృద్ధి చెందుతున్నాయ‌ని అన్నారు. కానీ, రాజ్య‌స‌భ త‌లుపులు మూసివేసి మ‌రీ ఆంధ్ర‌, తెలంగాణ‌ల‌ను విభ‌జించార‌న్నారు. తెలుగుత‌ల్లి చంపి, బిడ్డ‌ను బ‌తికించార‌ని అప్పుడే చెప్పాన‌న్నారు.

ఆంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేరుస్తాం

ప్ర‌త్యేక‌హోదా కంటే ప్ర‌త్యేక ప్యాకేజీ ద్వారానే ఎక్కువ మేలు జ‌రుగుతుంద‌ని టీడీపీ నేత‌లే ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. ఎన్డీఏ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. అందుకే హోదాతో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నీ ఇచ్చేందుకు ప్ర‌త్యేక ప్యాకేజీ తీసుకువ‌చ్చామ‌ని, దీనిని చంద్ర‌బాబు నాయుడు కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపార‌న్నారు. ఎన్డీఏ నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో ఆయ‌న‌తో ఫోన్ లో మాట్లాడాన‌ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకుపోతున్నార‌ని చెప్పాన‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం విష‌యంలో తాము వెన‌క‌డుగు వేసే ప్ర‌శ్నే లేద‌న్నారు. రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు అమ‌లుచేసి తీరుతామ‌న్నారు.

కాంగ్రెస్ కు వారిపైనే న‌మ్మ‌కం లేదు

అంత‌కుముందు ఆయ‌న కాంగ్రెస్ పార్టీపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాహుల్ గాంధీ చేసిన విమ‌ర్శ‌ల‌ను తీవ్ర‌స్థాయిలో తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏ వ్య‌వ‌స్థ‌పైనా న‌మ్మ‌కం లేద‌ని, ఆఖ‌రికి వారిపైనే వారికి న‌మ్మ‌కం లేద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ క‌ల్పించిన గొప్ప అవ‌కాశ‌మ‌ని, 30 ఏళ్ల త‌ర్వాత పూర్తి మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వంపై విశ్వాసాన్ని పెంచేందుకు ఇది సంద‌ర్భమ‌ని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ వ‌స్తే భూకంపం వ‌స్తుంద‌న్నార‌ని, మ‌రి భూకంపం రాలేద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌ధాని సీట్లో ఎప్పుడెప్పుడు కూర్చోవాల‌ని వారు ఆరాట‌ప‌డుతున్నార‌ని కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సంఖ్యాబ‌లం లేనిది అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టార‌నేది అర్థం కాని ప్ర‌శ్న అన్నారు. 2019లో త‌మ‌ను అధికారంలోకి రానివ్వ‌మ‌ని అంటున్నార‌ని, ప్ర‌జాస్వామ్యంపై న‌మ్మ‌కం లేని వారే ఇలా మాట్లాడ‌తార‌న్నారు. 2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిస్తే ప్ర‌ధాని అవ్వాల‌నే ఆరాటం త‌ప్ప ఇత‌ర స‌మ‌స్య‌ల గురించి తెలియ‌ద‌ని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. స‌బ్ కా స‌బ్ కా వికాస్ నినాదంతో తాము ప‌నిచేస్తున్నామ‌న్నారు.

వారి స్వార్థాన్ని దేశం గ‌మ‌నిస్తోంది

తాము అధికారంలోకి వ‌చ్చాక 18 వేల గ్రామాల‌కు విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించామ‌ని, ఇంత‌కుముందు పేద‌ల‌కు బ్యాంకులు త‌లుపులు కూడా తీసేవీ కావ‌ని, కానీ తాము 32 కోట్ల మందికి జ‌న్‌ధ‌న్ ప‌థ‌కం ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించామ‌న్నారు. త‌మ ప‌నితీరును గుర్తించ‌డానికి విప‌క్షాల‌కు మ‌న‌స్సు రావ‌డం లేద‌న్నారు. వారి స్వార్థాన్ని దేశ‌ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి దేనిపైనా విశ్వాసం లేద‌ని, క‌నీసం ఈవీఎంల‌పై, రిజ‌ర్వు బ్యాంకుపై కూడా విశ్వాసం లేక‌పోవ‌డం వారి స‌మ‌స్య అన్నారు. దేశ‌సైనికులు ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తే అనుమానించార‌ని, తాను ఎన్ని మాట‌ల‌నైనా స‌హిస్తాను కానీ, సైనికుల‌ను అంటే మాత్రం స‌హించేది లేద‌న్నారు.

పేద‌త‌ల్లి క‌డుపున పుట్టాను...క‌ళ్ల‌లోకి చూడ‌లేను...

తాను క‌ళ్ల‌లోకి సూటిగా చూడ‌లేక‌పోతున్నార‌ని రాహుల్ వ్యాఖ్యానించార‌ని, పేద‌త‌ల్లి క‌డుపులో, చిన్న‌కులంలో పుట్టిన తాను ఎలా చూడ‌లగ‌ల‌న‌ని ప్ర‌శ్నించారు. సుభాష్ చంద్ర‌బోస్ నుంచి శ‌ర‌ద్ ప‌వార్‌, ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వ‌ర‌కు మీ క‌ళ్ల‌లోకి సూటిగా చూసిన వారి ప‌రిస్థితి ఎంటో చ‌రిత్రకు, దేశానికి తెలుస‌న్నారు. క‌ళ్ల‌తో ఆడే ఆట‌లు ఇవాళ దేశం మొత్తం చూసింద‌ని ఎద్దేవా చేశారు. ద‌ళితుల‌ను, మైనారిటీల‌ను ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయం చేస్తోంద‌ని, జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల‌పైనా రాజ‌కీయం చేయ‌డం త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికారు.

ప్ర‌ధాని ప్రసంగానికి అడ్డుత‌గిలిన టీడీపీ ఎంపీలు

ప్ర‌ధాన మంత్రి స‌మాధానంతో సంతృప్తిచెంద‌ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆయ‌న ప్ర‌సంగానికి అడ్డుత‌గిలారు. వీ వాంట్ జ‌స్టీస్ అంటూ నినాదాలు చేశారు. విభ‌జ‌న హమీలు నెర‌వేర్చాలంటూ పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు.

 

Similar News