వైసీపీ అధినేత జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను వేలం వేయాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అక్రమంగా, ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ ఆస్తులను ఎందుకు వేలం వేయకూడదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేస్తున్నప్పుడు జగన్ ఆస్తులను వేలం వేయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. జగన్ మోసం చేసే వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.
జగన్ ఆస్తులు వేలం వేయాల్సిందే....
అగ్రిగోల్డ్ యాజమాన్యం వ్యాపారం చేసిందని, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి ఆస్తులను కొనుగోలు చేసిందని, అయితే వ్యాపారం నష్టాలు రావడంతో ప్రజలకు డిపాజిట్లు తిరిగి చెల్లించలేకపోవడం వల్లనే ఆస్తులను వేలం వేస్తున్నామన్నారు. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకులను ముంచి వేల కోట్ల రూపాయలు లూటీ చేసి విదేశాలకు చెక్కేశారని, ఇక్కడ ఆయన ఆస్తులను సీజ్ చేస్తున్నారన్నారు. నీరవ్ మోడీ కంటే ఘోరమైన మోసాన్ని జగన్ చేశారన్నారు. వీరిద్దరి కంటే జగన్ ఎక్కువ నేరగాడని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
చిత్తుగా ఓడించండి......
వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఒక డ్రామాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టిపారేశారు. ముహూర్తం చూసుకుని మరీ ఐదుగురు ఎంపీల చేత రాజీనామాలు చేయించారన్నారు. ఇప్పుడు రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు. అందువల్లనే జగన్ బీజేపీతో కుమ్మక్కై రాజీనామా డ్రామాలను ఆడిస్తున్నారన్నారు. ఈ కుట్రలను ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలను దూరం పెట్టాలన్నారు. వారికి అధికారమిస్తే ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ గా మారుస్తారని, అటువంటి తప్పు చేయవద్దని ప్రజలకు సూచించారు.