అర్థం పర్థం లేని హామీలను ఇస్తూ... అలవికాని వాగ్దానాలు చేస్తూ కోతి మూకలు మీ ముందుకు వస్తున్నాయని, వాటికి అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అంగన్ వాడీ టీచర్లకు వేతనాలు పెంచిన సందర్భంగా వారంతా వచ్చి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రతి అంగన్ వాడీ కార్యకర్త గ్రామాల్లోకి వెళ్లి మళ్లీ చంద్రన్న అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతందని చెప్పాలన్నారు. రెండోసారి కూడా గెలిస్తేనే అభివృద్ధి పనులు కొనసాగుతాయని ప్రజల్లోకి పెద్దయెత్తున తీసుకెళ్లాలని కోరారు.
కేంద్రం మెడలు వంచడానికి......
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి 25 పార్లమెంటు స్థానాలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి విభజన హామీలన్నింటినీ సాధించుకోవచ్చన్నారు. ప్రధాని ఎవరో మనమే నిర్ణయించుకోవచ్చన్నారు. అలాగని అవతల వారు గెలిస్తే,...కోతులు గుంపులు వచ్చినట్లేనని, రాష్ట్రం ఇక బాగుపడదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజల్లో సంతృప్తి స్థాయిని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని గ్రామాల్లో చాటి చెప్పాలని ఆయన అంగన్ వాడీ కార్యకర్తలను కోరారు.