మాట్లాడేటప్పుడు నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని, లేకుంటే పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రమేష్ ను పరామర్శించడానికి వెళ్లిన పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దీక్షల వల్ల ఉక్కు రాదు...తుక్కు రాదు అన్న వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయినట్లు తెలిసింది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, పార్టీ పరువును దిగాజర్చేలా మాట్లాడవద్దని సీఎం నేతలకు సూచించారు.
జేసీ వ్యాఖ్యలపై అసంతృప్తి......
అనంతపురం జిల్లా నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజలుగా దీక్షలు చేస్తున్న సీఎం రమేష్ శిబిరం వద్దకు వెళ్లి ఇలా మాట్లాడితే ఇక ఏం ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు సంకేతాలిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల కోసం సిద్ధమవ్వాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు.
ముందస్తు ఎన్నికలు వచ్చినా.....
మోడీ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, బీజేపీ నుంచి బయటకు రావడం మంచే జరుగుతుందని ఆయన నేతలకు చెప్పారు. వైసీపీ, బీజీల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితేనే విజయం దక్కుతుందన్నారు. ఇది కేవలం తాను ఒక్కడినే చేస్తే సరిపోదని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ సమిష్టిగా చేయాల్సిన పని అని చెప్పారు. నేతలు విభేదాలను మరిచి సమిష్టిగా పోరాడాలన్నారు. ఇప్పటివరకూ జరిగింది పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు కదలాల్సిన సమయం వచ్చిందన్నారు.
విడివిడిగా క్లాస్......
ముఖ్యంగా మంత్రి పరిటాల సునీతతో చంద్రబాబు విడిగా మాట్లాడారు. వరదాపురి సూరితో ఉన్న విభేదాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలసింది. సునీతతో మాట్లాడే సమయంలోనే వరదాపురి సూరిని కూడా పిలిపించి చంద్రబాబు మాట్లాడారు. ఒకరినొకరు గొడవలు పడుతుంటే ప్రతిపక్షానికి ప్లస్ అవుతుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, మీ విభేదాలతో దానికి తూట్లు పొడవద్దని హెచ్చరించారు. అనంతపురం జిల్లా నేతలతో విడివిడిగా సమావేశమయిన చంద్రబాబు ప్రతి ఒక్కరికీ క్లాస్ పీకారు. కాగా ఈ సమావేశానికి జేసీ దివాకర్ రెడ్డి గైర్హాజరయ్యారు.