బాబు అనుకున్నది సాధిస్తారా?

Update: 2018-06-16 12:30 GMT

చంద్రబాబు హస్తినలో చక్రం తప్పేందుకు రెడీ అయిపోయారా? బీజేపీకి వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు మరోసారి ఢిల్లీలో ప్రయత్నం చేస్తారా? ఈరోజు చంద్రబాబు ఢిల్లికి చేరుకుంటారు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అయితే దీనికంటే ముందుగానే ఆయన బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలవాలని నిర్ణయించుకున్నారు. కేవలం నీతిఆయోగ్ సమావేశం గురించి మాత్రమే కాకుండా భవిష్యత్ కార్యాచరణపైన ఆయన పలువురు ముఖ్యనేతలతో మాట్లాడనున్నారు.

కేజ్రీవాల్ కు .....

బీజీపీతో, మోడీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయిన చంద్రబాబు ఢిల్లీ చేరుకోగానే తొలుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వద్దకు వెళతారు. అరవింద్ కేజ్రీవాల్ గత ఆరు రోజుల నుంచి లెఫ్ట్ నెంట్ గవర్నర్ నివాసం వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ ఆందోళనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘీభావాన్ని తెలియజేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ వ్యవస్థను కేంద్రం నీరుగార్చిందని, రాజ్ భవన్ లను రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటుందని చంద్రబాబు ట్విట్టర్లో మండిపడిన సంగతి తెలిసిందే.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో....

నీతి ఆయోగ్ సమావేశం ముందు గాని తర్వాత గాని బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో మాట్లాడారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ లతో కూడా ఫోన్లో సంప్రదింపులు జరిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేయడమే కాకుండా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేయనున్నారని టీడీపీ ముఖ్యనేత ఒకరు చెబుతున్నారు. మొత్తం 24 పేజీలతో ప్రసంగ పాఠాన్ని చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. తనకు ప్రసంగించే అవకాశం ఇవ్వకుంటే అక్కడే నిరసన తెెలపాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ విషయంలో మాత్రం....

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాత్రం దూరంగా ఉంచబోతున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీని కలసి రాష్ట్ర సమస్యలపై వినతులను అందించారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమేవేశం ముగిసిన తర్వాత కేసీఆర్ కూడా ప్రత్యేకంగా ఇతర పార్టీల నేతలతో భేటీ అవుతారని చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం కేసీఆర్ ను కలవాలా? లేదా? అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. మొత్తం మీద బాబు ఢిల్లీ పర్యటనపై తెలుగుతమ్ముళ్లు భారీ ఆశలే పెట్టుకున్నారు.

Similar News