వైసీపీకి మరో అస్త్రం దొరికిందా?

Update: 2018-06-18 02:30 GMT

నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీతో కరచాలనం చేసి మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానిని నిలదీస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడకు వెళ్లి మోడీతో రహస్య మంతనాలేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

తొలిసారి మోడీతో.....

బీజేపీ. టీడీపీ బంధం చెడిపోయాక తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ పరస్పరం ఒకే సమావేశంలో కలిశారు. అదే నీతి ఆయోగ్ సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన హామీలతో పాటుగా జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని కూడా వివరించారని చెబుతున్నారు. అయితే సమావేశం మధ్యలో కేరళ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, మమత బెనర్జీ, కుమారస్వామి, చంద్రబాబు ఒకచోట చేరి చర్చించుకుంటున్నారు.

ప్రధాని పలకరింపులు....

వారి మధ్యకు ప్రధాని వచ్చి పలుకరించారు. కుశల ప్రశ్నలు అడిగారు. దీంతో చంద్రబాబు మోడీతో కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. ఈ ఫొటో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మోడీపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు ఇలా చేయడమేంటని కొందరు ప్రశ్నిస్తుండగా, వైసీపీ మాత్రం తనకు అచ్చొచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటోంది. కేవలం ఎన్నికల కోసమే చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నారని, లాలూచీ రాజకీయాలు బీజేపీతో ఇంకా చేస్తున్నది చంద్రబాబేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

లాలూచీయే నంటున్న వైసీపీ......

అంతేకాదు బీజేపీ మంత్రి భార్యకు తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యురాలిగా చేయడం కూడా ఇందులో భాగమేనని వైసీపీ ఆరోపిస్తుంది. నిన్నటి వరకూ పీఏసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆకుల వ్యవహారం నడిపిన టీడీపీకి ఇది మింగుడుపడటం లేదు. అయితే ప్రధానమంత్రి సాక్షాత్తూ తమ అధినేత వద్దకు వచ్చి పలుకరిస్తే ప్రతి నమస్కారం చేయడం సంస్కారమని టీడీపీ వాదిస్తోంది. మొత్తం మీద ఏపీలో ఏ చిన్న సంఘటనను అయినా అధికార, విపక్షాలు అందిపుచ్చుకుని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Similar News