ఇద్దరూ వెళ్లిపోతేనే బెటర్?

Update: 2018-04-27 03:30 GMT

చంద్రబాబు కి క్లిష్ట సమయంలో తలపోటులు తెస్తున్నారు తమ్ముళ్లు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఏవి సుబ్బారెడ్డి, మంత్రి అఖిల ప్రియ నడుమ సాగుతున్న ఆధిపత్యపోరు అక్కడనుంచి అమరావతి వరకు చేరుకుంది. చివరికి పార్టీ అధినేతే ఇరువురిని పిలిచి పంచాయితీ పెట్టిన సిఎం ఇలా అయితే పార్టీలో కొనసాగడం కష్టమని తేల్చి చెప్పేశారు. ఇద్దరిమీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తో భేటీ తరువాత ఆళ్లగడ్డ బృందాలు కారాలు మిరియాలు నూరుకుంటూ వెళ్లిపోయాయి. తనను ఇద్దరూ శుక్రవారం కలవాల్సిందిగా అఖిలప్రియను, ఏవీ సుబ్బారెడ్డిని చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రితో సమావేశం ఉన్నా అటు అఖిలప్రియ సోదరి నాగ మౌనిక, ఇటు ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వితలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రికి సయితం చికాకు తెప్పించిందంటున్నారు. ఈరోజు జరిగే సమావేశంలో ఇద్దరికీ చంద్రబాబు కాస్త గట్టిగానే క్లాస్ పీకే అవకాశముంది.

ఇంకా చాలా పంచాయితీలు పెట్టాలి ...

క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో ఇప్పడు నియోజకవర్గానికి ఒక్కో కుంపటి వుంది. రెండు మూడు వర్గాలుగా నియోజక వర్గాలవారి తన్నేసుకుంటున్నారు. ముఖ్యంగా వైసిపి నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతుంది. పార్టీ మారిన వారి అంశంలో మరీను. ప్రతి నియోజక వర్గంలో ఈ గోల ఎదో ఒక రూపంలో పెరిగి పెద్దది అవుతుంది. మరి ఒక్కొక్కటిగా బాబు పార్టీలో చిక్కు ముడులుగా మారిన వ్యవహారాలను ఎలా సర్దుబాటు చేస్తారో వేచి చూడాలి.

Similar News