ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు అటు రాజకీయాల్లోనూ ఇటు అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచారు. రాబోయే ఎన్నికల్లోగా కొన్ని మెగా కార్యక్రమాలనకైనా శాంపిల్ కి చేసి చూపించాలని బాబు తహ తహ లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లనే చంద్రబాబు పార్టీకి ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలుచుకోనున్నారు. నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా వుండి నాలుగు అడుగుల పిట్టగోడ కూడా కట్టలేదంటూ వైసిపి రోజా వంటివారు నిత్య పురాణం గా బాబును తిట్టిపోస్తున్నారు. జనసేన అధినేత పవన్ సైతం అదే అంటున్నారు. దాంతో రాజధాని కోసం ప్రచారం పై చంద్రబాబు సాగించిన ప్రచారానికి కొంత డ్యామేజ్ పడుతుంది.
సింగపూర్ లో బాబు ...
దీన్ని కవర్ చేయాలంటే రాజధాని అంశంలో ఎంతో కొంత పురోగతి చూపాలిసిన అవసరం వుంది. ఈ నేపథ్యంలోనే బాబు సింగపూర్ లో దిగిపోయారు. పలు కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు. పెట్టుబడులు, ప్రాజెక్ట్ లే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగుతుంది. ఎన్నో కొన్ని అర్జెంట్ గా తెచ్చి కొన్ని పనులైనా రాబోయే ఎన్నికల లోపు పూర్తి చేసి చూపిస్తే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందని చంద్రబాబు ఆలోచనగా వుంది.
అన్ని కోణాల్లో......
అదేవిధంగా విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎంతో కొంత తిప్పికొట్టే అవకాశాలు ఉన్నాయని టిడిపి వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఒకవైపు బీజేపీని ప్రధాన శత్రువుగా చూపిస్తూ, వైసీపీ, జనసేన పార్టీలను దోషులుగా చిత్రీకరిస్తూ, మరోవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఆ దిశగానే బాబు అడుగులు శరవేగంగా ఇప్పుడు పడుతున్నాయి. అయితే ఇవి ఎంతవరకు కార్యాచరణలోకి వస్తాయో చూడాలి.