కడప పంచాయతీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాకు చెందిన వరదరాజులు రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వరదరాజులు రెడ్డిల మధ్య నెలకొన్న వివాదంపై చంద్రబాబు కడప నేతలతో భేటీ అయ్యారు. అయితే సఖ్యతగా ఉండాల్సిన సమయంలో ఈ వివాదాలేమిటని చంద్రబాబు చికాకు పడ్డారు. ఏదైనా సమస్యలుంటే నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చించుకోవాలి కాని మీడియాకెక్కడమేమిటని ప్రశ్నించారు.
వరదరాజులు రెడ్డి వ్యాఖ్యలతో......
రెండు రోజుల క్రితం సీనియర్ నేత వరదరాజులు రెడ్డి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం రమేష్ సొంత విమానాల్లో తిరుగుతున్నారని, బద్వేలు, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట నియోజకవర్గాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి సీఎం రమేష్ పార్టీ నేతల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. సీఎం రమేష్ పంచాయతీ బోర్డు సభ్యుడికి ఎక్కువ.... ఎంపీటీసీకి తక్కువ అని విమర్శించారు.
వరదపైనే సీరియస్......
ఈ నేపథ్యంలో కడప జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందరూ కలసి కట్టుగా ఉండాల్సిన తరుణంలో ఈ విభేదాలేమిటని ఆయన నేతలను ప్రశ్నించారు. వరదరాజులు రెడ్డిపై ఆయన సీరియస్ అయినట్లు సమాచారం. సీఎం రమేష్ పై ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా తనకు వచ్చి చెప్పవచ్చని, అలాగాకుండా మీడియాకు ఎక్కి పార్టీ పరువును బజారున పడేయటమని ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తంమీద కడప జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ఇప్పటికైనా కడప తెలుగు తమ్ముళ్లు కలసి పనిచేస్తారో? లేదో? చూడాలి.