రాష్ట్రంలో రాజకీయ కుట్రజరుగుతోందని తెలుగుదేశం మహానాడు అభిప్రాయపడింది. మహానాడు చివరిరోజు రాజకీయ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలన్నారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమన్వయం చేసుకుని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలపై చిన్నచూపు మొదలయిందన్నారు. రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి మోడీ నియంత పాలన కొనసాగిస్తున్నారని యనమల ఆరోపించారు.
భ్రష్టుపట్టించారు ఇద్దరూ....
మోడీ, అమిత్ షాలు బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకుని అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేశారన్నారు. మేఘాలయ, మణిపూర్, గోవాల్లో ఇదే జరిగిందన్నారు. కర్ణాటకలో కూడా అదే డ్రామా చేయాలని బీజేపీ తలపెట్టగా ప్రాంతీయ పార్టీలు అడ్డుకున్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని కూడా యనమల అభిప్రాయపడ్డారు.
సీబీఐ దాడుల పేరుతో బెదిరింపులు....
మోడీ, షాలను థిక్కరిస్తే సీబీఐ, ఆదాయపు పన్ను శాఖల నుంచి దాడులు జరుపుతామంటూ బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదన్నారు. జగన్, పవన్ లను అడ్డం పెట్టుకుని కుట్రలకు తెరలేపారన్నారు. ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీల హవాయే నడుస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని కూడా రాజకీయ తీర్మానంలో పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీడీపీ మహానాడు లో రాజకీయ తీర్మానం చేసింది.
జాతీయ రాజకీయాల్లోకి.....
మహానాడులో రాజకీయ తీర్మానం మొత్తం మోడీయే టార్గెట్ గా చేశారు. ఈ తీర్మానం బట్టి జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు త్వరలోనే వెళతారన్న సంకేతాలను మహానాడు ద్వారా ఆ పార్టీ శ్రేణులకు పంపినట్లయింది. చంద్రబాబు గతంలోనూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, మరోసారి ఆ పాత్ర పోషించి రాష్ట్రానికి తగిన న్యాయం జరిగేలా చేస్తారని మహానాడు ద్వారా ప్రజలకు భరోసా పంపించింది తెలుగుదేశంపార్టీ. బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే ధ్యేయంగా మహానాడులో రాజకీయ తీర్మానం చేయడం విశేషం.