మోడీకి "'సీన్" లేదని తేల్చేసిన....?

Update: 2018-05-03 02:30 GMT

కర్ణాటకలో బీజేపీ గాలి లేదని తేలింది. ఇది ఎవరో చేసిన సర్వే కాదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చిన తాజా నివేదికలో కన్నడనాట బీజేపీకి గెలుపు కష్టమేనని తేల్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్ఎస్ఎస్ కర్ణాటక రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ కు పూర్తి స్థాయి మెజారిటీ స్థానాలు దక్కించుకుంటాయని తేలింది. అంతేకాదు బీజేపీకి ఆశించిన సీట్లు కూడా రావని సంఘ్ సర్వే తేల్చడంతో కమలనాధుల్లో ఆందోళన బయలుదేరింది.

కాంగ్రెస్ బలం తగ్గలేదా?

ఈ నెల 12వ తేదీన కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలో ఈ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్నాయి. ప్రధాని మోడీ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అమిత్ షా అక్కడే తిష్టవేసి మోడీకి మరో కానుక ఇవ్వాలని తపన పడుతున్నారు. కాని ఇది సాధ్యమయ్యేలా లేదని ఆర్ఎస్ఎస్ నివేదిక తేల్చింది. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆర్ఎస్ఎస్ తన అంతర్గత సర్వేలో తేల్చింది. కాంగ్రెస్ బలం ఏమాత్రం తగ్గలేదని కూడా చెప్పింది.

అన్నీ ప్రతికూలమే.....

ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెైస్ కు 115 నుంచి 120 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. అలాగే బీజేపీకి 70 సీట్లు మించి రావని కూడా చెప్పింది. మరో పార్టీ అయిన జనతాదళ్ ఎస్ 34 కు మించి స్థానాలను గెలుచుకోలేదని కూడా చెప్పింది. దీంతో బీజేపీ శ్రేణులు ఈ వారం రోజులు మరింత శ్రమపడాలని పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ సర్వేలో యడ్యూరప్పకు లింగాయత్ లు కూడా మద్దతిచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది. మొత్తం మీద కన్నడనాట బీజేపీ గెలుపు కష్టమేనని ఆర్ఎస్ఎస్ తేల్చిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు బీజేపీ దీనిని కొట్టిపారేస్తుంది. ఆర్ఎస్ఎస్ ఎటువంటి సర్వే నిర్వహించలేదని, ఇది కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద సంఘ్ సర్వే కన్నడనాట చర్చనీయాంశమైంది.

Similar News