Weather Report : సాయంత్రానికి దంచికొట్టనున్న వర్షం.. పగటి పూట మాత్రం అదిరే ఎండలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగలు ఎండల తీవ్రత, సాయంత్రానికి వర్షం కురిసేఛాన్స్ ఉందని రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అకాల వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచాయని, చెట్లు నేలకొరిగాయనితెలిపారు. అదే సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టంజరగకపోవడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. నేడు కూడా భారీవర్షం కురిసే అవకాశముందన్న హెచ్చరికలు వినిపించాయి.
నేడు ఆంధ్రప్రదేశ్ లో...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులతో పాటు మోస్తరు వర్షాలు పడతాయనిచెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లకింద ఉండవద్దని, గంటకు నలభై నుంచి యాభైకిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొంది. ప్రజలు సాయంత్రం వేళ వీలయినంత వరకూ ఇళ్లలోనే ఉండటం మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణాలో ఈరోజు...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇదే సమయంలో పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా పేర్కొంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అంటే ఉష్ణోగ్రతలు నలభై నుంచి నలభై రెండు డిగ్రీల కు చేరుకుంటాయని పేర్కొంది. ఈరోజు జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, వరంగల్ , మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొడ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.