తమ్ముడు..తమ్ముడే.. పాలిటిక్స్.. పాలిటిక్సే

మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజీకీయాలకు దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తాను వంద శాతం రాజకీయాల్లోకి తిరిగి రానని చెప్పారు

Update: 2023-01-12 04:16 GMT

మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజీకీయాలకు దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తాను వంద శాతం రాజకీయాల్లోకి తిరిగి రానని చెప్పారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొరుగు రాష్ట్ర రాజకీయాలతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. రాజకీయాలకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, సినిమాలకు మాత్రం సొంత రాష్ట్రమయిందా? అన్న ప్రశ్నలను నెటిజన్లు వేస్తున్నారు. మెగాస్టార్ కు ఏపీతోనే అనుబంధం ఎక్కువ. అక్కడే అభిమానులు ఎక్కువ. అక్కడే పుట్టి .. అక్కడే పెరిగి ఇంతవాడయిన చిరంజీవికి ఏపీ పొరుగు రాష్ట్రమయిందా? అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.


పొరుగు రాష్ట్రంగా...

రాజకీయాలంటే ఇష్టం లేకపోవచ్చు. అంతవరకే చిరంజీవి పరిమితమయితే బాగుండేది. కానీ ఏపీని పొరుగు రాష్ట్రంగా ఆయన నోటి నుంచి రావడంతో మోగా అభిమానులు నొచ్చుకుంటున్నారు. చిరంజీవి సినిమాలకు అత్యధిక షేర్ ను అందించేది ఆంధ్రప్రాంతమే. అక్కడే ఆయన ఇటీవల తన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. విశాఖలో ఇల్లుకట్టుకోవాలని ఉందని ఆకాంక్షను వెలిబుచ్చారు. విశాఖ అంటే తనకు ఎనలేని ప్రేమ అని చెప్పుకొచ్చారు. అయితే ఏపీ రాజకీయాలంటేనే చిరంజీవికి విరక్తి కలిగిస్తున్నాయి.
ఓటమే కారణమా?
అందుకు ప్రధాన కారణం ఆయనను 2009లో పాలకొల్లులో ఓడించడమేనని అంటున్నారు. తన అంచనాలుకు భిన్నంగా ఆరోజు ప్రజారాజ్యం పార్టీకి పెద్దగా సీట్లు రాకపోవడంపైనకూడా ఆయన కలత చెందారంటున్నారు. ప్రజారాజ్యం పెట్టి ముఖ్యమంత్రిని అయిపోతానని భావించిన చిరంజీవి నాడు పద్దెనిమిది సీట్లకే పరిమితమయ్యారు. పాలకొల్లులో ఓడి, తిరుపతిలో గెలిచిన చిరంజీవి తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయి కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు. కానీ రాష్ట్రాన్ని విడగొట్టడంతో చిరంజీవి ఎటూ కాకుండా పోయారు. ఆ తర్వాత ఆయన తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉన్నారు.

నేరుగా మద్దతు కూడా...
నిజానికి తన సోదరుడు పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీకి నేరుగా వచ్చి ప్రచారం చేయకపోయినా ఒక ప్రకటన ద్వారా మద్దతిస్తారని మెగా అభిమానులు భావించారు. కానీ చిరంజీవి ఆ పని కూడా చేయరని అర్థమయింది. ఆయన ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుంది. చిరంజీవి తొలి నుంచి వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు కూడా ఆచితూచి చేస్తారు. ఎవరినీ నొప్పించరు. తనపై విమర్శలు చేసిన వారిని కూడా పెద్దగా పట్టించుకోరు. అలాంటి చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం ఏపీ రాజకీయాల్లో వేలుపెడతారనుకోవడం భ్రమే అవుతుంది. పవన్ అందలమెక్కితే సంతోషిస్తారు. రాజకీయంగా నష్టపోతే బాధపడతారు. పరోక్షంగా నిధులు వంటి వాటి విషయంలో సాయం చేయవచ్చేమో కాని ప్రత్యక్షంగా మద్దతును మాత్రం ప్రకటించరన్నది ఆయన మాటలతో స్పష్టమయింది.


Tags:    

Similar News