మోడీపై మాయావతి నిప్పులు

Update: 2018-04-07 18:29 GMT

బీజేపీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైరయ్యారు. బీజేపీని ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదన్నారు. ఒడిషాలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీతో సహా ఎన్డీఏకు మిత్రపక్షాలన్నీ ఎందుకు దూరమవుతున్నాయో చెప్పాలని మాయావతి అమిత్ షాకు రాసిన లేఖలో ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ జంతువులతో అమిత్ షా పోల్చడాన్ని తప్పు పట్టారు. అమిత్ షా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాయావతి ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా అర్థం కాలేదా? అని నిలదీశారు.

దిక్కుతోచని స్థితిలో బీజేపీ.....

ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో దిక్కుతోచని బీజేపీ నేతలు విపక్షాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బీజేపీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అమిత్ షా, మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలను దిగజారి పోయాయని విమర్శించారు. అందరినీ చులకన చేసి మాట్లాడటం బీజేపీ నేతలకు తగదని మాయా అన్నారు. ముందు మిత్రపక్షాలను మంచి చేసుకోమని ఆమె సూచించారు.

అహంకారాన్ని దించేస్తారు.....

బీజేపీ నేతలకు అతి విశ్వాసం, అహంకారం ఎక్కువయిందని మాయావతి ఫైరయ్యారు. దీనికారణంగానే బలమైన మిత్రపక్షాలన్నీ దూరమవుతున్నాయని గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను అమలు పర్చకుండా, అన్యాయం చేసినందునే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిందన్నారు. ఇప్పుడు బీజేపీ ఏకాకిగా మారిందన్నారు. బీజేపీ నేతలకు తలకెక్కిన అహంకారాన్ని ప్రజలే దించుతారని మాయావతి జోస్యం చెప్పారు.

Similar News