ప్రశ్నించడం నేర్పింది ఎర్రసూరీడే...!

Update: 2018-05-27 02:30 GMT

విప్లవ సినీ నిర్మాత రెడ్ స్టార్ మాదాల రంగా రావు (64) ఇక లేరు. గత కొంతకాలంగా ఆయన శ్వాస కోశ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో పోరాడుతున్నారు. నేటి తెల్లవారుజామున ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం నగర్ లోని ఆయన కుమారుడు మాదాల రవి ఇంటికి తరలించనున్నారు.

తొలినుంచి పోరుబాట...

ప్రశ్నించడం అనేది తెలుగు ప్రజల్లో ఉదయించేలా చేసింది మాదాల రంగారావు. తన విప్లవ సినిమాలతో ఆయన ప్రజల్లో ముఖ్యంగా పీడిత తాడిత వర్గాల్లో చైతన్యం తెచ్చింది అంతా ఇంతా కాదు. తన తొలిచిత్రం ఛైర్మెన్ చలమయ్య సూపర్ హిట్ కావడంతో నిర్మాత గా మారారు రంగారావు. ఆయన నిర్మించిన ఎర్ర మల్లెలు, బలిపీఠంపై భారతనారి, మరో కురుకేత్రం, విప్లవశంఖం, మహా ప్రస్థానం,ఎర్ర సూరీడు, వంటి అనేక చిత్రాలు ఆయన ఆలోచనలనుంచి వెండితెరపై ఆణిముత్యాలు గా ప్రజల గుండెల్లో నిలిచాయి. మాదాల నిర్మించిన యువతరం కదిలింది చిత్రానికి నంది అవార్డు అందుకుంది.

నాటితరం ఎర్రసూరీడు ఆయనే ...

విప్లవ చిత్రాలంటే ఆర్ నారాయణ మూర్తి ఈతరం వారికి గుర్తుండి పోయారు. కానీ మాదాల రంగారావు నారాయణ మూర్తి కి వెండితెరపై వెలగడానికి మూలం అని ప్రస్తుత తరానికి తెలియదు. తన విప్లవ సినిమాల నిర్మాణంలో రంగారావు అనేక అటు పోట్లు ఎదుర్కొన్నారు. తరచూ ఆయన చిత్రాలకు సెన్సార్ బ్రేక్ లు వేసేది. దానిపై తనదైన శైలిలో పోరాడేవారు మాదాల. చెన్నై లోని సెన్సార్ బోర్డు పై ఆయన సాగించిన పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఉద్యమానికి శివాజీ గణేశన్ వంటివారు మద్దతు పలికారు. అదేవిధంగా రంగారావు చిత్రాల విడుదల కోసం లెఫ్ట్ పార్టీలు రోడ్డెక్కేవి. కార్మిక పక్షపాతిగా సాగే ఆయన చిత్రాలు సమాజంలో మార్పు కోసం నినదించేవి. విప్లవ చిత్రాలు అయినా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాదు అందరిని ఆలోచింప చేసేవి. బడుగుల బతుకు చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు దృశ్య కావ్యాలుగా మలచడంలో సినిమా రంగాన్ని మించింది లేదని తన జీవన ప్రస్థానం అంతా సామాజిక మార్పు కు అలుపెరగని కృషి చేసిన మాదాల రంగారావు కి తెలుగు పోస్ట్ శ్రద్ధాంజలి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ...!

Similar News