ముద్రగడ ఎంట్రీ తప్పేట్లు లేదా?

కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాట సమితి నేతగా ముద్రగడ పద్మనాభం పేరును ఏపీ రాజకీయాల నుంచి వేరు చేసి చూడలేం.

Update: 2022-03-22 07:20 GMT

కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాట సమితి నేతగా ముద్రగడ పద్మనాభం పేరును ఏపీ రాజకీయాల నుంచి వేరు చేసి చూడలేం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముద్రగడ ముఖ్యమైన పాత్ర పోషించాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది. ముద్రగడ బలమైన కాపు సామాజికవర్గాన్ని ప్రభావితం చేయగలరన్న నమ్మకమే ఇందుకు కారణం. అయితే ఆయన కొంతకాలంగా కాపు ఉద్యమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో తన కుటుంబంపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

కాపు ప్రయోజనాల కోసం....
అయినా ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు కాపుల ప్రయోజనాల కోసం లేఖలు రాస్తూనే ఉన్నారు. అంటే తాను ఇంకా యాక్టివ్ గానే ఉన్నానని పరోక్షంగా సంకేతాలను ఇచ్చినట్లే. ప్రస్తుతం ఏపీలో కాపు నేతలు ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ముద్రగడను పక్కన పెట్టి వీరంతా ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కాపులకు రాజ్యాధికారం కావాలన్న ఏకైక డిమాండ్ తోనే వారు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాల వెనక పరోక్షంగా ముద్రగడ సలహాలు, సూచనలను అందిస్తున్నట్లు తెలిసింది.
ఆఫర్లు వచ్చినా....
ఇక ముద్రగడ పద్మనాభంకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలకు కొదవ లేదు. ప్రధాన జాతీయ పార్టీ ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయినా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. మరో ప్రాంతీయ పార్టీ ఆయనకు రాజ్యసభ టిక్కెట్ ను కూడా ఆఫర్ చేసింది. దీనికి కూడా ముద్రగడ పద్మనాభం ఒప్పుకోలేదని తెలిసింది. కేవలం కాపు ప్రయోజనాల కోసమే తాను పనిచేస్తానని, పదవుల అవసరం లేదని వారికి చెప్పినట్లు తెలిసింది.
టీడీపీకి మద్దతుగా...
అయితే ఇటీవల కాలంలో కాపులను ఒక పార్టీ వైపునకు తీసుకు పోయే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ముద్రగడ భావిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా కాపు ఓటు బ్యాంకు మారే అవకాశముందని భావించిన ఆయన కొందరు కాపు పెద్దలతో మాట్లాడరని తెలిసింది. తమను మోసం చేసిన చంద్రబాబుకు మద్దతిచ్చి మరోసారి మోస పోవద్దని కూడా ముద్రగడ వారివద్ద కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. కాపుల్లో ఐక్యత వస్తే రాజ్యాధికారం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని, తాత్కాలిక ప్రలోభాలకు గురై కొన్ని పార్టీలకు మద్దతిస్తే కాపు జాతికి అన్యాయం చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారని చెబుతున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభం రీ ఎంట్రీ ఖాయమైందన్న టాక్ నడుస్తుంది.


Tags:    

Similar News