"కుమార" ముహూర్తం బాగాలేదా?

Update: 2018-05-24 03:27 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన గంటల్లోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కుమారస్వామి మంచి ముహూర్తం చూసి ప్రమాణ స్వీకారం చేసినా, కాంగ్రెస్ లో బలమైన నేత అడ్డం తిరగడంతో సంకీర్ణ సర్కార్ కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ లో మాజీ మంత్రి డీకే శివకుమార్ కీలకనేత. పార్టీ ఇబ్బందులున్న సమయంలో ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఐటీ దాడులను సయితం భరించి ఆయన పార్టీకోసం నిలబడ్డారు.

డిప్యూటీ సీఎం ఇవ్వకపోవడంతో.....

అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని పరమేశ్వర్ కు ఇవ్వడాన్ని డీకే వర్గం తప్పుపడుతుంది. తమ నేత కాంగ్రెస్ కు చేసిన సాయాన్ని మరచి పదవుల విషయానికి వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. డీకే శివకుమార్ కూడా అలిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తాను పదవుల కోసం దరఖాస్తు చేయనని, అలాగని పదవులు ఇవ్వకపోతే ఊరుకునే వాడిని కాదని కూడా ఆయన హెచ్చరించి వెళ్లినట్లు సమాచారం.

ఫోన్ స్విచాఫ్ చేసి.......

డీకే శివకుమార్ కాంగ్రెస్ ఇన్ చార్జి వేణుగోపాల్ తో తీవ్రస్థాయిలోనే వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. "నేను కోరితేనే పదవులు ఇస్తారా? పార్టీకి చేసిన సేవలను గుర్తించరా? ఆపదలో ఉన్న సమయంలో నేను గుర్తొస్తానా..." అంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలయింది. కుమారస్వామి బలపరీక్ష ఉండటంతో డీకే శివకుమార్ కోసం కాంగ్రెస్ నేతలు వేట ప్రారంభించారు.

Similar News