కోట్ల పార్టీ మార్పు ఖాయం.. రీజ‌న్ ఏంటంటే..!

Update: 2018-07-21 06:30 GMT

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయో చెప్ప‌డం క‌ష్టం. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొవాల్సి ఉంటుందో కూడా తెలియ‌ని స్థితి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే.. రాజ‌కీయ దిగ్గ‌జ ఫ్యామిలీ.. కోట్ల కుటుంబానికి ఎదురైంది! కాంగ్రెస్‌లో త‌మ‌కు తిరుగులేద‌ని, త‌మ‌కు ఎదురు లేద‌ని, కాంగ్రెస్ అంటే తామే.. తామంటే కాంగ్రెస్ అని భావించిన ఈ ఫ్యామిలీకి అదే కాంగ్రెస్ ఇస్తున్న విలువ ఎంత‌? అదే కాంగ్రెస్ కోట్ల ఫ్యామిలీని చూస్తున్న విధానం ఏంటి? వ‌ంటి అంశాల‌ను ప‌రిశీలిస్తే.. చాలా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలే ఎదుర‌వుతున్నాయి. కోట్ల ఫ్యామిలీని పూచిక పుల్ల‌తో స‌మానంగా కాంగ్రెస్ ట్రీట్ చేస్తోంద‌ని అంటున్నారు కోట్ల అభిమానులు. త‌మ‌కు కానీ, త‌మ వ్య‌క్తుల‌కు కానీ కాంగ్రెస్ విలువ ఇవ్వ‌డం లేద‌ని కోట్ల ఫ్యామిలీ సైతం వాపోతోంది.

కోట్ల అంటే కాంగ్రెస్ అనేలా...

విష‌యంలోకి వెళ్తే.. కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి హ‌యాం నుంచి ఈ ఫ్యామిలీ కాంగ్రెస్‌కే అంకిత‌మైంది. త‌మ ఇంట్లో ఏ శుభ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. కాంగ్రెస్ పార్టీలో జ‌రిగిన‌ట్టుగా భావించే ఈ ఫ్యామిలీ ఆ పార్టీతో అంతగా క‌లిసిపోయింది. విజ‌య భాస్క‌ర‌రెడ్డి త‌ర్వాత ఆయ‌న కుమారుడు సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోనే సేవ‌లు అందిస్తున్నారు. కాంగ్రెస్ కు వెన్న‌ద‌న్నుగా ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం క‌ర్నూలులో ఈయ‌న త‌ప్ప వేరే వారు ఎవ‌రూ కూడా కాంగ్రెస్ జెండాను మోయ‌డం లేదు. అంతేకాదు, 2014 త‌ర్వాత కాంగ్రెస్ ఏపీలో నామ‌రూపాలు కోల్పోయింది. ఎంద‌రో నేత‌లు కాంగ్రెస్‌కు టాటా చెప్పారు. కానీ, కోట్ల ఫ్యామిలీ మాత్రం కాంగ్రెస్‌తోనే నిల‌బ‌డింది.

సీడ‌బ్లూసీలో స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డంతో

మ‌రి అలాంటి ఫ్యామిలీని కాంగ్రెస్ ఎలా చూడాలి? ఎలా గౌర‌వించాలి? కానీ, ఇప్పుడు కోట్ల‌కు కాంగ్రెస్‌లో ఏ మాత్ర‌మూ విలువ లేకుండా పోయింది. కోట్ల ఫ్యామిలీని కాంగ్రెస్‌ పార్టీ అవమానాలకు గురిచేస్తోందని ఆయన అనుచరులు వాపోతున్నారు. రాజ్యసభ సీట్ల కేటాయింపు సందర్భంగానూ ఆయన్ను పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. తాజాగా పార్టీలో కేంద్ర బిందువైన సీడబ్ల్యూసీలో కూడా స్థానం కల్పించకపోవడం తమ నేతను అవమానించడమేనని అంటున్నారు. ఆదర్శవంతమైన కుటుంబమని, రెండుసార్లు సీఎంగా చేసిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని గుర్తించడం లేదని అనుచ‌రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్త‌వానికి గ‌డిచిన మూడేళ్లుగా కోట్ల ఫ్యామిలీకి ఇత‌ర పార్టీల‌ నుంచి అనేక ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

చంద్ర‌బాబు ఎన్ని ఆఫ‌ర్లు ఇచ్చానా..

అయినా కూడా కోట్ల మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అధికార పార్టీ టీడీపీ ఆహ్వానించడంతో పాటు భారీ ఆఫర్లను కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఏకంగా సీఎం చంద్రబాబు స్థాయిలో కోట్లను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు కోరినట్టుగా సీట్లు కూడా ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను కోట్ల సున్నితంగా తిరస్కరించారు. ఏకంగా కోట్ల బంధువు ద్వారా హైదరాబాద్‌లో కలిసి మరీ ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కూడా కోట్ల కుటుంబంతో చర్చలు జరిపారు. సూర్యప్రకాష్‌రెడ్డి కుమారుడు రాఘవేంద్ర వివాహం సందర్భంగా ఆయన కుటుంబంతో చర్చలు జరిపి.. డోన్, ఆలూరుతో పాటు ఎంపీ స్థానం ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

పార్టీ మార‌డం ఖాయ‌మేనా..?

పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని కోట్లకు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆయన టీడీపీలో చేరేదిలేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. కాగా.. కోట్లకు తగినంత గుర్తింపు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఆయన వర్గీయుల్లో బలంగా ఉంది. రాజ్యసభ సీటు కేటాయిస్తారని ఆశించారు. అది జరగకపోగా.. తాజాగా సీడబ్ల్యూసీలోనూ స్థానం కల్పించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.దీంతో త్వ‌ర‌లోనే ఆయ‌న పార్టీ మార‌డం ఖాయ‌మనే వార్త‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

Similar News