కోట్ల పోటీ చేసే అవకాశం లేదా?

కర్నూలు జిల్లాలో రాజకీయాలను దశాబ్దాల కాలాల పాటు శాసించిన కుటుంబాల్లో కోట్ల కుటుంబం ఒకటి.

Update: 2022-03-22 02:39 GMT

కర్నూలు జిల్లాలో రాజకీయాలను దశాబ్దాల కాలాల పాటు శాసించిన కుటుంబాల్లో కోట్ల కుటుంబం ఒకటి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేసి జిల్లాకు ప్రత్యేకతను తెచ్చిపెట్టారు. కర్నూలు జిల్లా అంటేనే కోట్ల, కేఈ కుటుంబాలు గుర్తుకువస్తాయి. కేఈ కుటుంబంలో కేఈ కృష్ణమూర్తి ఇప్పటికే రాజకీయంగా తప్పుకుంటున్నట్లు గత ఎన్నికలకు ముందే ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ వారసులను, సోదరులను రంగంలోకి దింపారు.

పోటీకి దూరం...
ఇప్పుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సయితం ఇదే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి ఆయన కర్నూలు ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం లేకపోవచ్చని చెబుతున్నారు. కర్నూలు లోక్ సభ స్థానం నుంచి తన సతీమణి సుజాతమ్మను, ఆలూరు నుంచి తన కుమారుడిని బరిలోకి దింపాలన్న యోచనలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు రాజకీయాలు లేవు. డబ్బులతో పాటు గ్రామస్థాయిలో కరడు గట్టిన వర్గమంటూ ఉండాలి. ఆ రెండు తమకు లేవని కోట్ల ముఖ్యుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.
పార్టీ పరిస్థితి...
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థిితి కూడా ఏమంత మెరుగుపడలేదు. బీజేపీ, జనసేన కలిస్తే కొంత బలం చేకూరుతుంది. అయితే టీడీపీలో తమ కుటుంబం ఉన్నప్పటికీ తాను మాత్రం పోటీకి దూరంగా ఉండాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిర్ణయించుకున్నారు. త్వరలో చంద్రబాబు వద్దకు వెళ్లి తన మనసులో మాటను కూడా చెప్పదలచుకున్నారని సమాచారం. చంద్రబాబు కూడా వయసు మీద పడిన నేతలకు టిక్కెట్లు ఇవ్వకూడదన్న నిర్ణయంతో ఉన్నారు.
బాబుతో భేటీ తర్వాత.....
ప్రధానంగా యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న నిబంధనను చంద్రబాబు అమలు పరిస్తే తాను ఎంపీకి పోటీ చేయకుండా సుజాతమ్మను ఆలూరు నుంచి బరిలోకి దించాలన్న ప్రయత్నం లో ఆయన ఉన్నారు. ఆయన పోటీ చేయకుండా కుటుంబ సభ్యులను ఒకరిని బరిలోకి దింపే అవకాశాలున్నాయి. పార్లమెంటుకా? అసెంబ్లీకా? అన్నది త్వరలో తేలనుందని కోట్ల సన్నిహితులు చెబుతున్నారు.


Tags:    

Similar News