క్యాడర్ లేని కొత్తపల్లి... కేవలం దానిపైనే?

కొత్తపల్లి సుబ్బారాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. ఆయన మాటంటే జిల్లాలో తిరుగులేనిదిగా ఉండేది

Update: 2022-06-02 03:08 GMT

కొత్తపల్లి సుబ్బారాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. ఆయన మాటంటే జిల్లాలో తిరుగులేనిదిగా ఉండేది. కానీ ఒకప్పుడు. 2004 ముందు వరకూ మాత్రమే. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1989లో ఆయన టీడీపీలో చేరారు. యువకుడు కావడం, సామాజికవర్గంలో పట్టు ఉండటంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. చంద్రబాబు హయాంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు శాఖ మంత్రిగా పనిచేశారు.

అన్ని పార్టీలు మారి....
2004లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయినా కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రం గెలిచి సత్తా చాటారు. ఎంపీగా కూడా గెలిచారు. అటువంటి నేత ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు మారారు. ఇక మిగిలింది ఏపీలో ఒకే పార్టీ. 2004 వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2012లో కాంగ్రెస్ లో చేరి అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 2014కు ముందు వైసీపీలోకి వెళ్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో టీడీపీలో చేరారు. టీడీపీలో కాపు కార్పొరేషన్ పదవిని అందుకున్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు.
ప్రాధాన్యత లేక...
వైసీపీ లో చేరినా ఆయనకు ఎటువంటి ప్రాధాన్యత లభించలేదు. ఆయన ఆశించినట్లుగా పదవులు లభించలేదు. తనకు ఇక పార్టీలో అవకాశాలు దక్కవని భావించిన కొత్తపల్లి సుబ్బారాయుడు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాల విభజనతో ఆయన మరింత దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన నరసాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని జరుపుతున్న ఉద్యమాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగా చెప్పుతో కూడా కొట్టుకున్నారు.
జనసేన నుంచి హామీ....?
కానీ కొత్తపల్లి సుబ్బారాయుడును తొలి నుంచి నమ్ముకున్న క్యాడర్ మాత్రం ఇప్పుడు ఆయన వెంట లేదంటున్నారు. కేవలం అతి కొద్ది మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అన్ని పార్టీలు మారిన ఆయనకు సొంత సామాజికవర్గమైన కాపుల్లోనూ సదభిప్రాయం లేదు. నిలకడలేని నేతగా పేరొందారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందన్న కారణంతో ఆయన మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలోకి వెళ్లినా కొత్తపల్లి సుబ్బారాయుడికి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కదు. అందుకే ఆయన జనసేనలో చేరనున్నారు. జనసేన సీనియర్ నేతలతో ఆయన టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. వారిచ్చిన హామీతోనే వైసీపీకి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిసింది. ఏపీలో చివరిగా మిగిలిన పార్టీ జనసేన మాత్రమే. మరి ఆయన రాజకీయ భవిష్యత్ కు జనసేన ఏ విధంగా ఉపయోగపడుతుందనేది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News