కిషన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారా?

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మంత్రిపదవికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది.

Update: 2022-09-03 03:07 GMT

కిషన్ రెడ్డి వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? ఆయన పోటీకే మొగ్గు చూపుతున్నారా? లేదా తన కుటుంబ సభ్యుల ను బరిలోకి దింపనున్నారా? అనే చర్చ జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ప్రతి నియోజకవర్గంలోనూ కీలక నేతలను బరిలోకి దించాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో కీలక నేతలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఇప్పటి నుంచే బీజేపీ కసరత్తులు ప్రారంభించినట్లు తెలిసింది. వరస సమావేశాలు నిర్వహిస్తూ సమర్థవంతమైన నేతల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవసరమైతే ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు జరుగుతుంది.

ఒకే ఒక స్థానం...
2018 శానససభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో ఒకే ఒక్క స్థానం లభించింది. అదీ నగరంలోని గోషామహల్ నుంచి రాజాసింగ్ ఎన్నికయ్యారు. అన్ని చోట్ల నుంచి అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 119 నియోజకవర్గాల్లో దాదాపు 107 నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఈసారి పరిస్థితులు అలా లేవు. బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా పుంజుకుంది. కాంగ్రస్ ను తోసిరాజని కొంత జనంలోకి వస్తుంది. అయితే హైదరాబాద్ జంటనగరాల్లో పార్టీ పరిస్థితిని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.
రెండుసార్లు వరసగా...
ఇందులో భాగంగా అంబర్ పేట్ నియోజకవర్గం పై బీజేపీ ప్రధాన దృష్టి పెట్టింది. అంబర్ పేట్ నియోజకవర్గంలో రెండుసార్లు బీజేపీ విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. 2014లోనూ ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కానీ 2018 ఎన్నికల్లో ఆయన గెలుపొందలేక పోయారు. హ్యాట్రిక్ విజయం మిస్ అయ్యారు. అప్పుడు కూడా కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. అంబర్ పేట్ లో ఆయన ఇటీవల తరచూ పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉండి అంబర్ పేట్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
శాసనసభ ఎన్నికల్లో...
అయితే ఈసారి ముందుగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు రానున్నాయి. అందువల్ల కిషన్ రెడ్డి పోటీ చేస్తారన్న గ్యారంటీ లేదు. కిషన్ రెడ్డి అయితేనే ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుందని సర్వే నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి మోడీ కేబినెట్ లో కీలకంగా ఉన్నారు. ప్రధాని గుడ్ లుక్స్ లో ఉన్నారు. ఏడాది ముందే జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మంత్రిపదవితో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన కుటుంబ సభ్యులను పోటీ చేయించే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. కిషన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారంటున్నారు. మరి చివరకు పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.


Tags:    

Similar News