తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ పై దృష్టి సారించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తేవాలని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కోల్ కత్తాకు వెళ్లి కలసి వచ్చిన కేసీఆర్ తర్వాత జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో పాటు మరికొందరు జాతీయ నేతలతో కూడా చర్చించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలంటున్న కేసీఆర్ మళ్లీ వేగం పెంచారు.
దేవెగౌడతో భేటీ.....
ఈరోజు కేసీఆర్ కర్ణాటక పర్యటనకు వెళ్లనున్నారు. బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కేసీఆర్ కలవనున్నారు. దేవెగౌడతో జాతీయ రాజకీయాలు మాట్లాడి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్న కేసీఆర్ మాజీ ప్రధాని దేవెగౌడతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక ఎన్నికల్లో దేవెగౌడ కు చెందిన జనతాదళ్ ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా అక్కడ పోటీకి దిగింది.
తమకు లాభిస్తుందంటున్న జేడీఎస్....
దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అనుభవం ఉన్న దేవెగౌడతో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించాలని భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో కేసీఆర్ తమను కలవడం లాభిస్తుందని జేడీఎస్ అంచనా వేస్తోంది. ఎందుకంటే కర్ణాటకలో తెలంగాణకు చెందిన అనేక మంది ఓటర్లు ఉన్నారు. కేసీఆర్ తో భేటీ ఈ ఎన్నికల్లో తమకు ప్రయోజనం చేకూరుతుందని జేడీఎస్ నేత కుమారస్వామి భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోరు ప్రధానంగా ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ రాకుంటే, జేడీఎస్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించవచ్చన్నది జేడీఎస్ ఆలోచన. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు జేడీఎస్ భారీ ఏర్పాట్లే చేస్తోంది.