కేసీఆర్, బాబు ల మంత్రాలకు ఓట్లు రాలతాయా ..?

Update: 2018-06-06 08:30 GMT

చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు వాస్తు, ముహుర్తాలు చూసుకుని కీలక అంశాల్లో స్టెప్స్ వేస్తారు. అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రెటేరియట్ వరకు అలాగే సభలు సమావేశాలు అన్ని ముహుర్తాలు వాస్తుల ప్రకారమే సాగించడం చూసాం. ఇక పూజలు పునస్కారాలు యాగాలు హోమాలు కూడా భారీగానే నిర్వహిస్తారు. ఇక చంద్రబాబు సైతం కేసీఆర్ బాటలో పడ్డారు. గతంలో సీఎం గా వున్నప్పుడు అంత ప్రాధాన్యత ఇవ్వని బాబు వాస్తు, పూజలకు చాలా జాగర్తలు తీసుకుంటున్నారు. ఓటుకు నోటు కేసు నమోదు అయ్యాకా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అనేక వాస్తు మార్పులు చేయించారు. అలాగే అమరావతిలో సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ రాజధాని సైతం పూర్తి వాస్తు ప్రకారం డిజైన్ చేయించారు. బాబు అమరావతి ప్లాన్ ను కేసీఆర్ సైతం మెచ్చుకున్నారు. బాబు ఈశాన్యంలో కృష్ణా నది ఉండేలా రూపొందించిన డిజైన్ అదిరిందని అభినందించారు. ఇలా వీరిద్దరూ ఒకరి ని మరొకరు ప్రామాణికంగా తీసుకుని ముందుకు పోతున్నారు.

నేతలందరికీ సెంటిమెంట్లే...

చంద్రబాబు ధర్మ పోరాట సభలను వాస్తు ప్రకారమే మొదలు పెట్టారు. ఏపీలో ప్రధానమైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పూర్తి చేసిన బాబు జిల్లాల వారి సభల అంశంలో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ నుంచి ప్రారంభించి తరువాత సభ కడపలో ఏర్పాటు చేసుకున్నారు. ఇక వైసిపి అధినేత జగన్ సైతం తన ప్రజాసంకల్ప పాదయాత్ర ఆరంభానికి ముందు తిరుమల వెంకన్నను దర్శించుకుని ఇడుపుల పాయనుంచి యాత్ర స్టార్ట్ చేశారు. బాబు, కేసీఆర్ జగన్ ల ఎఫక్ట్ వాస్తు ప్రభావమో ఏమో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఉత్తరాంధ్ర నుంచి తన యాత్ర ప్రారంభించారు. ఇక కేసీఆర్ రైతుబంధు ను తన సెంటిమెంట్ ప్రాంతమైన కరీంనగర్ నుంచి శ్రీకారం చుట్టారు. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు సకల సన్నాహాలు చేసుకుంటూ ప్రజల్లో ఉంటున్నాయి. ఇందులో వాస్తు, ముహుర్తాలు కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్ల వర్షం కురుస్తుంది ? ఆయా పార్టీల వాస్తు ముహుర్తాలు ఫలిస్తాయా లేదా అన్నది తేలాలి అంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాలిసిందే.

Similar News