కర్ణాటక ఎన్నికల్లో సీన్ మారుతోంది.క్షణక్షణానికి సీట్ల అంకెల్లో తేడాలు రావడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుతుందా అన్న అనుమానం తలెత్తుతోంది. ఇప్పటికి బీజేపీ 104 స్థానాల్లో ముందంజలో ఉంది. మరో తొమ్మిది స్థానాలు దక్కించుకుంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవచ్చు. కాంగ్రెస్ 77, జేడీఎస్ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్నది కాంగ్రెస్ వ్యూహం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జేడీఎస్ నేత కుమారస్వామికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, గులాం నబీ ఆజాద్ లు అక్కడే మకాం వేసి జేడీఎస్ నేతలతో టచ్ లో ఉన్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ మేరకు కాంగ్రెస్ గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా కోరారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారనుంది. కాంగ్రెస్ మాత్రం తాము జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్నామని ప్రకటించింది.