టీడీపీ లో కాపు నేతలు ఏమయ్యారు? హాట్ టాపిక్

కాపు రిజర్వేషన్ల ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2021-11-24 04:31 GMT

కాపు రిజర్వేషన్ల ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుటుంబాన్ని బజారుకీడ్చారని మండిపడ్డారు. అప్పుడు అవమానం మీకు కన్పించలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు కన్నీళ్లు కార్చడం తనకు ఆశ్చర్యం కల్గించిందన్నారు. ఆయన రాసిన లేఖపై తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా స్పందన లేదు. టీడీపీలో కాపు నేతలు లేరా? ఒక్క చినరాజప్ప మినహా ముద్రగడ లేఖపై టీడీపీ నుంచి ఏ కాపు నేత స్పందించకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

బలమైన నేతలున్నా....
టీడీపీలో బలమైన కాపు నేతలు ఉన్నారు. వంగవీటి రాధా, బొండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, జ్యోతుల నెహ్రూ, గంటా శ్రీనివాసరావు, నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కాపు నేతలే ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది పదవులను దక్కించుకున్నారు. కానీ చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాసినా వారి నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో టీడీపీ ఇతర సామాజికవర్గాల నేతల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మినహా...
ముద్రగడ లేఖకు స్పందించింది ఒక్క చినరాజప్ప మాత్రమే. వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నారు. ఆయనకు తన తండ్రి వారసత్వంగా ఇచ్చిన బలమైన కాపు సామాజికవర్గం అండగా ఉందని భావిస్తున్నారు. ఆయన కూడా ముద్రగడ విషయంలో నోరు మెదపలేదు. వంగవీటి రాధా మౌనంగా ఉండటానికి కారణాలేంటన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ముద్రగడకు ధీటైన నేత ఎవరూ లేరన్నది దీనిని బట్టి స్పష్టమవుతుంది.
బాబుకు నివేదిక....
ఇక గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు కన్నీళ్లు కార్చినప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు. ముద్రగడ లేఖపై స్పందిస్తారనుకోవడం వృధాయే. మిగిలిన టీడీపీ కాపునేతలకు ఏమయిందన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. దీనిపై చంద్రబాబుకు ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నివేదిక వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ముద్రగడను విమర్శించేందుకు టీడీపీ కాపు నేతలు జంకుతున్నట్లే కనపడుతుంది.


Tags:    

Similar News