కన్నా కంగారెత్తించేశారు

Update: 2018-06-24 13:30 GMT

రాష్ట్రంలో నడిచేది టిడిపి, వైసిపి ప్రభుత్వమేనని, కాదని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఇద్దరూ కలిసే ప్రభుత్వం నడుపుతూ ఎవర్ని మోసం చేస్తారని ఆయన నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం బిజెపి బాధ్యత అని రాష్ట్రం ఖర్చు చేసే ప్రతి పైసా చెల్లించామన్నారు కన్నా. ప్రాజెక్ట్ నిర్మాణం పై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు ఆయన. ఎన్డీయే అధికారంలోకి రాగానే సోము వీర్రాజు, వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి ముంపు మండలాల ఆర్డినెన్స్ ఆవశ్యకత తెలియచేస్తే మోడీ ప్రాజెక్ట్ పూర్తి చేసే చిత్తశుద్ధితోనే వాటిని ఏపీలో కలిపారన్నారు. పొత్తులో మొన్నటి దాకా ఉన్నందున ఈ నిజం చెప్పలేదని, చంద్రబాబు కి నిజాలు చెప్పే అలవాటు లేనందువల్లే ఈ సమస్య అన్నారు కన్నా.

పట్టిసీమ లోటుపాట్లపై ...

పట్టిసీమ ప్రాజెక్ట్ అంశంలో లోటుపాట్లపై కాగ్ ఎత్తి చూపిందని వారే దానిపై చర్యలు చేపడతారన్నారు ఆయన. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి ప్రత్యక్షంగా చూసేందుకే ఆ ప్రాంతానికి బిజెపి బృందం వెళుతుంది తప్ప రాజకీయం చేయడానికి కాదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. పదహారువేలకోట్ల రూపాయల ఖర్చుతో పాత రేట్లకే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని, చంద్రబాబు 30 వేలకోట్ల రూపాయలు నుంచి 64 వేలకోట్ల రూపాయలు వరకు పెంచిన దానితో సంబంధం లేదని పోలవరం అధారిటీ అన్ని చూసుకునే చెబుతుందన్నారు. రాష్ట్రం వాస్తవంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి పైసా బకాయి లేకుండా కేంద్రం చెల్లిస్తుందన్నారు కన్నా. ఈ ఖర్చులు, పనులు లెక్కలు తేల్చడానికి తాము సాంకేతిక నిపుణలం కాదని అందుకే వ్యాఖ్యలు చేయబోమన్నారు లక్ష్మీనారాయణ.

భూసేకరణ వుంది కాబట్టే ...

పోలవరం తాము నిర్మిస్తామని రాష్ట్రం చెప్పడం, కీలకమైన భూసేకరణ ఉన్నందున కేంద్రం అంగీకరించింది అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు. తాము నిర్మించలేమని రాష్ట్రం చేతులు ఎత్తేస్తే కేంద్రం నిర్మాణ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా వున్నారు కన్నా. మేం కడతాం అన్నందుకే నమ్మి ఇచ్చామని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేస్తే ప్రతి పైసా కేంద్రం ఇచ్చేస్తుందని హామీ ఇచ్చారు లక్ష్మీనారాయణ.

Similar News